పుట:Oka-Yogi-Atmakatha.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

ఒక యోగి ఆత్మకథ

శ్రీయుక్తేశ్వర్‌గారి పొడిమాటలు కుమార్‌కి కొత్త. “నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు. కాని యోగ్యతద్వారా దాన్ని నిలుపుకోలేక పోయావు. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదటచేసిన పనిలోకే తిరిగి వెళ్ళు.

గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తరవాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్ లో, మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు కాని తోటి శిష్యుల విషయంలో కనబరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెల్లుబకదు మరి! కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టుడయి నప్పటికీ నాకేమీ నిరుత్సాహం కలగలేదు. మహాపురుషులకు సైతం ఉండే వ్యక్తిగతమైన విపరీత లక్షణాలు జీవన విధానాన్ని సంకీర్ణం చేస్తున్నాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాలచేత ప్రభావితం కాదు. నేను శ్రీయుక్తేశ్వర్‌ గారి దగ్గర పొందగోరినది, పై పై పొగడ్తలకన్న గొప్ప లాభం.

ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు; నేను చాలా నొచ్చుకున్నాను.

“నీ తల పేలిపోయేటంతగా పొగరెక్కిపోతోంది!” అంటూ, నే నొక హెచ్చరిక కూడా చేశాను, దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది: “నువ్వు కనక నీ పద్ధతులు మార్చుకోకపోతే, ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమంనుంచి వెళ్ళిపొమ్మని చెబుతారు.”

కుమార్ హేళనగా నవ్వుతూ, నే నన్నమాటలు, అప్పుడే గదిలో అడుగు పెట్టిన గురుదేవుల దగ్గర వల్లించాడు. ఇక తిట్లు తినవలసివస్తుందని అనుకుంటూ నేను ఒక మూల నక్కాను.