పుట:Oka-Yogi-Atmakatha.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

221

నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీయుక్తేశ్వర్‌గారు, “ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు” అన్నారు. “అతిథి మర్యాదలు చెయ్యడం, ఇతర శిష్యుల పని అజమాయిషీ చెయ్యడం నీ విధులు.”

ఒక పక్షం రోజుల తరవాత, తూర్పు బెంగాలునుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరి పిల్లవాణ్ణి ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదుగాని, శ్రీయుక్తేశ్వర్‌గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు.

“ముకుందా, నీ పనులు కుమార్‌ని చెయ్యనియ్యి. తుడవడం, వంట చెయ్యడం నువ్వు చెయ్యి.” కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు నాకీ ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాకు పెంచే సరికి కుమార్, నిరంకుశమైన పెత్తనం చలాయించడం మొదలుపెట్టాడు. తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించింది, రోజూ వారీ విషయాల్లో సలహాకు, నా దగ్గరికి వచ్చేవారు. ఈ పరిస్థితి మూడు వారాలపాటు సాగింది; అప్పుడు కుమార్‌కూ గురుదేవులకూ మధ్య జరిగిన సంభాషణ నాకు చాటునుంచి వినబడింది.

“ముకుందుడు అసాధ్యుడు!” అన్నాడా కుర్రవాడు. “మీరు నన్ను అజమాయిషీదారును చేశారు. అయినా తక్కినవాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి, అతను చెప్పిన మాటే వింటున్నారు.”

“అందుకే అతనికి వంటింటిపనీ నీకు కచేరీ సావడిపనీ ఆప్పజెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చెయ్యాలన్న కోరికేకాని అధికారం చలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు.”