పుట:Oka-Yogi-Atmakatha.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

ఒక యోగి ఆత్మకథ

వారని, గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టారు. అయితే, బయటికి కనబరిచే స్వభావం లేనివారవడంవల్ల ఆప్యాయమైన మాట ఒక్కటీ అనేవారు కారు.

నా మట్టుకు నా తత్త్వం ప్రధానంగా భక్తిపరమయినది. జ్ఞానపూర్ణులయిన మా గురుదేవులు భక్తిలేనివారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ, ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణితరీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తూండడం నన్ను కలవరపెట్టేది. కాని నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చినకొద్దీ దేవుడిమీద నాకున్న భక్తి[1] తత్పరత తగ్గకపోగా, మరింత పెరిగిందని కనిపెట్టాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారివారి ప్రధానమైన మొగ్గునుబట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్ళకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది.

శ్రీయుక్తేశ్వర్‌గారితో నా సంబంధం కొంతవరకు, మాటల్లో వ్యక్తంకాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది. నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింపజేసేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచు నాకు అనుభవంలోకి వచ్చేది.

గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం, నేను కాలేజిలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనబడింది. నేను శ్రీరాంపూర్‌లో గురుదేవుని సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజులవి.

  1. దేవుణ్ణి చేరే ప్రధాన మార్గాల్లో రెండు: జ్ఞానం, భక్తి.