పుట:Oka-Yogi-Atmakatha.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

3

అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే, ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కాని వేలకొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనక నిజమే అయితే, మానవుడంటే ప్రధానంగా ఆత్మ అని చెప్పాలి; అది ఒక రూపమంటూ లేనిదీ అంతటా వ్యాపించి ఉన్నదీను.

చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమయితే కావచ్చు కాని, మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తూండేటప్పుడు, సత్యసంధులైన స్త్రీపురుషులు తమ బాల్య స్మృతులను ఏకరువు పెట్టగా విన్నాను.

నేను జనవరి 5, 1893 తేదీన, హిమాలయపర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్‌పూర్ లో పుట్టాను. నా జీవితంలో మొదటి ఎనిమిదేళ్ళూ అక్కడ గడిచాయి. మేము ఎనిమిదిమంది తోబుట్టువులం. నలుగురు మొగపిల్లలం, నలుగురు ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్[1]; మొగపిల్లల్లో రెండోవాణ్ణి; అందరిలో నాలుగోవాణ్ణి.

మా అమ్మా నాన్నా బెంగాలీలు; క్షత్రియకులంవారు. ఇద్దరూ సాధుస్వభావులు. వాళ్ళలో ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనదీ గంభీరమైనది; హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావు లేదు. ఈ ఎనమండుగురు పిల్లలూ చేసే కోలాహలానికి ప్రశాంతమైన కేంద్రం మా తల్లిదండ్రుల సామరస్యమే.

  1. 1915లో నేను సనాతమైన ఆశ్రమ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకున్నప్పుడు నా పేరు యోగానందగా మారింది. 1935 లో మా గురుదేవులు పరమహంస అన్న సాంప్రదాయిక బిరుదు ప్రసాదించారు (చూడండి అధ్యాయాలు 24, 42).