పుట:Oka-Yogi-Atmakatha.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఒక యోగి ఆత్మకథ

సంబంధం ద్వారా, భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింప జేశాయి.

పసితనంలో నిస్సహాయస్థితిలో నేను పొందిన అవమానాలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నాకు నడక రాకపోవడంవల్లా మనస్సులో ఉన్న భావాల్ని స్పష్టంగా చెప్పలేకపోవడంవల్లా ఉక్రోషంగా ఉంటూండేది. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు, నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూండేవి. ఎంతో భావోద్రేకంతో నిండిన నా జీవితానుభవాలు నా మనస్సులో అనేక భాషల్లో వెల్లడవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా, క్రమక్రమంగా మావాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటుపడ్డాను. పసిపిల్లల మనస్సు, ఆటబొమ్మలతోనూ కాలివేళ్ళతోనూ ఆడుకుంటూండడానికే పరిమితమైందని అనుకుంటూ పెద్దవాళ్ళు ఎంత మోసపోతూ ఉంటారో!

నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి; మనస్సులో అలజడీ, దాన్ని వెళ్ళబెట్టుకోడానికి అలవికాని శరీరం- ఈ రెండూ దానికి కారణాలు. సాధారణంగా నా బాధ చూసి ఇంట్లోవాళ్ళు గాభరాపడుతూండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులూ, ఏదో పలకాలనీ తప్పటడుగులు వేయ్యాలనీ నేను చేసే తొలి ప్రయత్నాలూ ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకొంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మ విశ్వాసానికి సహజమైన ప్రాతిపదిక అవుతాయి.

ఈ మాదిరిగా సుదీర్ఘ కాలాల జ్ఞాపకాలు రావడం నా కొక్కడికే జరిగింది కాదు. నాటకంలో దృశ్యాల్లాగ ఒకదాని తరవాత ఒకటిగా మారుతూ వచ్చే “చావుపుట్టుకల" పరంపరకు లోనుకాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి