పుట:Oka-Yogi-Atmakatha.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ఒక యోగి ఆత్మకథ

నాన్నగారు భగవతీచరణ ఘోష్‌గారు దయాశీలురూ, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులూనూ. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు; ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కాని మా అమ్మ సంగతి వేరు; ఆవిడకు హృదయమే ప్రధానం. ఆవిడ మా కన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరవాత నాన్నగారు, తమలో ఉన్న మార్దవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మచూపే అనిపించేది.

తొలి దశలో పవిత్రగ్రంథాలతో కలిగే పరిచయం, తీపి చేదూ కలిసిన రుచిలా ఉంటుంది. ఈ రకమైన అనుభవం మేము మా అమ్మ దగ్గరే పొందాం. క్రమశిక్షణ అలవరచడంకోసం అమ్మ, సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణం లోంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇల్లాటి సందర్భాల్లో శిక్షవెయ్యడం, శిక్షణ ఇవ్వడం- రెండూ కలిసే ఉండేవి.

నాన్నగారు ఆఫీసునుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడంకోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ - నాగఫూర్ రైల్వేలో, ఉపాధ్యక్ష పదవిలాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి; నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి.

అవసరాల్లో ఉన్నవాళ్ళని ఆదుకోడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు;