పుట:Oka-Yogi-Atmakatha.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

ఒక యోగి ఆత్మకథ

కచ్చితమైన క్రమశిక్షణ పాటింపచేసే వారు; అనంతుడు తరచు కఠినంగా వ్యవహరించేవాడు. కాని శ్రీ యుక్తేశ్వర్‌గారి శిక్షణ పటిష్ఠమైనదనాలే కాని మరోరకంగా చెప్పడానికి వీలులేదు. క్షణికమైన విషయాల్లో నయితే నేం, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిద్యాల విషయంలో నయితే నేం, పరిపూర్ణతాప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు.

“చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది,” అన్నా రొకసారి సందర్భవశాత్తు, ఆయన. “సభ్యతలేని ఋజుత్వం, వైద్యుడి కత్తిలాగ, పనికివచ్చేదే కాని అప్రియమైనది. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక, ప్రశంసనీయమైనది కూడా.”

గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తిపడ్డట్టే కనిపించేవారు; ఎప్పుడోకాని దాన్ని ప్రస్తావించకపోవడమే నేనలా అనుకోడానికి కారణం. ఇతర విషయాల్లో మట్టుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు. పరధ్యానం, అప్పుడప్పుడు దిగాలుపడి ఉండడం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం, తీరువు లేకుండా అప్పుడప్పుడు పనిచెయ్యడం- ఇవే నా పెద్ద అపరాధాలు.

“మీ నాన్న భగవతిగారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత తీరువుగా ఉంటాయో చూడు,” అని మా గురువుగా రన్నారొకనాడు. లాహిరీ మహాశయుల శిష్యులయిన వీరిద్దరూ, నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకొన్నారు. మా నాన్నగారూ, మా గురువుగారూ ఒకరినొకరు గాఢంగా అభిమానించారు. వీళిద్దరూ యుగయుగాంతరాలకు కూడా క్షయంకాని ఆధ్యాత్మిక ఆధార శిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్మ్యాన్ని నిర్మించుకున్నారు.