పుట:Oka-Yogi-Atmakatha.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

ఒక యోగి ఆత్మకథ

మైన అనుబంధంవల్లనో భ్రాంతిలో పడ్డట్టుగాని భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టుగాని ఆయన నా కెన్నడూ కనిపించలేదు.

“మాయ అనే చీకటి చప్పుడు చెయ్యకుండా దగ్గరికి వస్తోంది. లోపలింటికి త్వరగా పోదాం, పద!” హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు, క్రియాయోగ సాధన చెయ్యవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి, యోగసాధన చెయ్యడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలిబుచ్చేవాడు.

“గతాన్ని మరిచిపో,” అంటూ శ్రీ యుక్తేశ్వర్‌గారు అతన్ని సముదాయించేవారు. “మనుష్యులందరి గతజీవితాలు అనేక అవమానాలతో చీకటి ముసురుకొని ఉన్నవే. మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతిదీ మెరుగవుతుంది.”

ఆశ్రమంలో గురువుగారిదగ్గర చిన్నచిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. వాళ్ళ బౌద్ధిక, ఆధ్యాత్మిక శిక్షణ ఆయన యావజ్జీవితాసక్తి. ఆయన గతించడానికి కొద్దికాలం ముందుకూడా, ఆరేళ్ళ వయస్సు గల కుర్రవాళ్ళ నిద్దరినీ, పదహారేళ్ళ వయస్సుగల కుర్రవాణ్ణి ఒకణ్ణి ఆశ్రమవాసానికి స్వీకరించారు. ఆయన వర్దీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు; ఈ విధంగా ‘శిష్య’, ‘శాసన’ (శిక్షణ) శబ్దాలు రెంటికీ వ్యుత్పత్తిలోనే కాకుండా ఆచరణరీత్యా కూడా పరస్పర సంబంధ మేర్పరచడం జరిగింది.

ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు; గౌరవించేవారు; ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు, ఆత్రంగా వచ్చి,