పుట:Oka-Yogi-Atmakatha.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

209

ఆయన పక్కన నిలబడేవారు. ఆయన మనఃస్థితి గంభీరమై అంతర్ముఖు లయినప్పుడు, మాట్లాడడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు; ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమకోసం ఏదయినా పని చేసిపెట్టమని ఇతరుల్ని అడగడం అరుదు; ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చెయ్యకపోతే స్వీకరించేవాడు కాడు. శిష్యు లెప్పుడయినా, ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనక మరిచిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కొనే వారు.

ఆయన మామూలుగా వేసుకొనే బట్టలు, సాంప్రదాయికంగా సన్యాసులు ధరించే కాషాయవస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడాయన, యోగుల సంప్రదాయాన్ని అనుసరించి, పులి చర్మంతోనో జింక చర్మంతోనో కుట్టిన, తాళ్ళులేని బూట్లు వేసుకొనేవారు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు; సంస్కృతంలో మంచి పరిజ్ఞానముంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోడానికి తాము నేర్పుగా రూపొందించిన సులభ పద్దతులు కొన్ని చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు.

గురుదేవులకు తమ శరీరం మీద అపేక్ష ఉండేది కాదు కాని, దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక మానసిక స్వస్థతల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘ కాలం ఉపవాసం చెయ్యదలచిన ఒక శిష్యుణ్ణి చూసి