పుట:Oka-Yogi-Atmakatha.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

203

విజ్ఞానశాస్త్రవేత్తలు కనిపెట్టగల సూత్రాల్ని ప్రకృతి నియమాలని అంటున్నారు. కాని గుప్తమైన ఆధ్యాత్మికస్థాయిల్నీ గూఢమైన, అంతశ్చేతననూ పాలించే సూక్ష్మనియమాలు కూడా ఉన్నాయి; ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కాని భౌతికశాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానంవల్లనే క్రీస్తు, ఒక సేవకుడికి, తన శిష్యుడు తెగ్గోసిన చెవిని మళ్ళీ ఇప్పించాడు.”[1]

మా గురువుగారు పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానించడంలో సాటిలేని వారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే. రత్నాలు పొదిగిన ఆభరణాలవంటి ఆయన ఆలోచనలు, అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిదపాలు కాలేదు. నాలో కుదురులేక శరీరంలో కొద్దిగా కదిలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు, మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది.

“నువ్విక్కడ లేవు.” అన్నారు శ్రీ యుక్తేశ్వర్‌గారు, ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి. ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు.

“గురూజీ!” నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. “నేను కదలలేదు; నా కనురెప్పలు ఆడలేదు; మీరు చెప్పిన ప్రతి మాటా మళ్ళీ వినిపించగలను!”

“అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల, నీ మనోవీథిలో నువ్వు మూడు సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి

  1. వాళ్ళలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుణ్ణి కొట్టి వాడి కుడిచెవి తెగ్గోశాడు. అయితే ఏసు, వాళ్ళను తాళమని చెప్పి, వాడి చెవి ముట్టుకొని నయం చేశాడు.” – లూకా, 22 : 50-51 (బైబిలు)