పుట:Oka-Yogi-Atmakatha.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

ఒక యోగి ఆత్మకథ

చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం; ఇంకొకటి ఒక కొండమీద; మరొకటి సముద్రపు ఒడ్డున.”

నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆ ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలేదు. క్షమార్పణ వేడుకొంటున్నట్టుగా ఆయన వేపు చూశాను.

“అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకళించుకొనే గురువుగారి దగ్గర నేను చెయ్యగలిగేది ఏముంది?”

“నువ్వు నా కా హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మసత్యాల్ని అవగాహన చేసుకోడం కష్టం. అవసరమయితే తప్ప నేను ఇతరుల మనసుల్లోని ఏకాంతతకు భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవనిదే పరమేశ్వరుడూ అందులోకి ప్రవేశించడు; నేను చొరబడ్డానికి సాహసించను.”

“మీకు ఎప్పటికీ స్వాగతమే, గురుదేవా!”

“వాస్తుకళా సంబంధమైన నీ కలలు తరవాత ఫలిస్తాయి, ఇది అధ్యయనానికి సమయం!”

ఈ విధంగా మా గురుదేవులు, సందర్భవశాత్తు, నా జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం, తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిశోర ప్రాయం నుంచి నాకు, వివిధ దృశ్యాల్లో మూడు భవనాల ఆకృతులు అస్పష్టంగా అవుపిస్తూ ఉండేవి. ఈ మూడు దర్శనాలూ శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరసలోనే భౌతికరూపం ధరించాయి. మొదట, రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లలకోసం యోగవిద్యాలయం స్థాపించడం