పుట:Oka-Yogi-Atmakatha.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

ఒక యోగి ఆత్మకథ

అనిపించింది. లాహిరీ మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని, మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను; నేను కాశీవెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను.

“ ‘నాయనా, ఏమయిందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి?’ అంటూ అమ్మ తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు. జబ్బు చెయ్యకముందు ఎంత నిండుగా, దృఢంగా ఉండేదో ఇప్పుడూ అలా ఉంది.

“నా బరువు తూచుకుని చూస్తే, ఒక్క రోజులోనే యాభై పౌన్లు పెరిగిన సంగతి గమనించాను; అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలచటి శరీరాన్ని చూసిన స్నేహితులూ పరిచయస్థులూ ఒక్కసారి తెల్లబోయారు. వాళ్ళలో కొందరు, ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకుని లాహిరీ మహాశయులకు శిష్యులయారు.

“బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు, ఈ ప్రపంచం, సృష్టికర్త ఘనీభూతస్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చెయ్యడంకాని, లుప్తం చెయ్యడంకాని, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడంకాని చెయ్యగలుగుతున్నారు.”[1]

“సృష్టి అంతా నియమబద్ధమైనది. లాహ్య జగత్తులో పనిచేసే,

  1. “నువ్వు ప్రార్థించేటప్పుడు వేటిని కోరతావో అవి నీకు వస్తాయనీ, వాటిని నువ్వు పొందుతావనీ నమ్ము” - మార్కు, 11 : 24. బ్రహ్మైక్యం పొందిన యోగులు తాము పొందిన దివ్యోపలబ్ధుల్ని, ప్రగతి సాధించిన శిష్యులకు పూర్తిగా బదిలీ చెయ్యగలవారు; ఈ సందర్భంలో లాహిరి మహాశయులు శ్రీ యుక్తేశ్వర్ గారికి అలాగే బదిలీ చేశారు.