పుట:Oka-Yogi-Atmakatha.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

175

అదీ తొందరగానే సుమా!” గౌరీమాత ఒక విసినికర్రని పట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చారు. తూర్పు దేశాలవారి సంప్రదాయ పద్ధతిలో మేము ఉన్నితో నేసిన చిత్రాసనాల మీద కూర్చున్న తరవాత, ఆవిడ మెల్లగా విసరడం ప్రారంభించారు. ఆశ్రమ విద్యార్థులు సుమారు ముప్ఫై రకాల వంటకాలతో ఇటూ అటూ తిరిగారు. దీన్ని మామూలు “భోజనం” అనడం కంటె “మృష్టాన్న భోజనం” అనడం సబబు. ఈ భూమి మీద పడ్డాక నేనూ జితేంద్రా అంత రుచిగల వంటకాలు ఎన్నడూ రుచి చూసి ఎరగం.

“రాజభోజనానికి తగ్గ వంటకాలివి, మాతాజీ! మీ రాజపోషకులకు, ఈ విందుకు రావడం కంటె అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను. జీవితాంతం మనస్సులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా!”

అనంతుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకొని ఉండవలసిన మేము, మా ధన్యవాదాలకు రెండు రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామయికి వివరించలేకపోయాం. కనీసం మా చిత్తశుద్ధి వెల్లడి అయింది. ఆవిడ ఆశీస్సుతోబాటు, ఆశ్రమానికి మళ్ళీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకొని మేము బయటికి వచ్చాం.

బయట వేడి దారుణంగా ఉంది. నేనూ నా స్నేహితుడూ ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కడిమిచెట్టు నీడలో తలదాచుకున్నాం. తరవాత ఘాటు ఘాటుగా సంభాషణ జరిగింది; జితేంద్ర మళ్ళీ అనుమానాల్లో పడ్డాడు.

“నువ్వు నన్ను పెద్ద చిక్కులోకి లాగావు! మధ్యాహ్న భోజనం మనకి కాకతాళీయంగా దొరికింది! కాని ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం, మన దగ్గర ఒక్క పైస లేకుండా? మళ్ళీ నువ్వు అనంతుడి ఇంటికి ఎలా తీసుకు వెళ్తావు నన్ను?”