పుట:Oka-Yogi-Atmakatha.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

ఒక యోగి ఆత్మకథ

వేరే ఇద్దరు అతిథుల్ని తీసుకొచ్చాం. మేము రైల్లో కలుసుకోగానే, వీళ్ళు కృష్ణభగవానుడి భక్తులుగా నన్ను ఆకర్షించారు.”

“వెళ్ళొస్తాం బాబూ!” అంటూ, మాకు పరిచితులైన ఇద్దరూ గుమ్మం వేపు నడిచారు. “దైవానుగ్రహముంటే మళ్ళీ కలుసుకుందాం.”

“మీ రిక్కడికి రావడం చాలా సంతోషం.” మాతృసహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు. “మీరు రావడానికి ఇంతకన్న మంచి రోజు లేదు. ఈ రోజు, ఆశ్రమం రాజపోషకు లిద్దరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. నా వంట మెచ్చుకునేవాళ్ళు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేది?”

మధురమైన ఈ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి; కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నాడు. బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి, రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది. అందుచేత మానసికంగా సర్దుబాటు చేసుకోడం కష్టమైపోయింది వాడికి. గౌరీమాత వాడివేపు కుతూహలంగా చూశారు; కాని ఏమీ వ్యాఖ్యానించ లేదు. బహుశా, ఇలాటి కుర్రతనపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి.

భోజనం వేళ అయిందని కబురు అందింది; గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్ళారు. వంటకాల సువాసనలతో ఘుమఘుమ లాడుతూ ఉందక్కడ. పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయా రావిడ.

ఈ క్షణం కోసం నేను ముందునుంచీ ఎదురు చూస్తున్నాను. జితేంద్ర ఒంటిమీద సరయిన చోటు ఒక్కటి చూసి ఒక్క గిల్లు గిల్లాను. వాడు రైల్లో నన్ను, ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేనూ అంత నొప్పి పెట్టేలా గిల్లాను.

“ఓయి అనుమానం మనిషీ, దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు–