పుట:Oka-Yogi-Atmakatha.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ఒక యోగి ఆత్మకథ

చిరునవ్వు చిందిస్తున్నారు ఆ సాధువు. నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను. “నువ్విప్పుడా పని చెయ్యకూడదు!” అన్నారాయన. “దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు. జగజ్జననిని నీ చేతులతో నా పాదాలు తాకనియ్యను!” నిరాడంబరులైన మాస్టర్ మహాశయులూ నేనూ జనసమ్మర్దంగల పేవ్‌మెంటు నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతూండడం కనక ఎవరయినా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిషాలో ఉన్నామని అనుమానించి ఉండేవారు. అలుముకుంటున్న ఆ సాయంకాలపు నీడలు కూడా మాతోబాటు దివ్యానందంతో మత్తెక్కి ఉన్నాయి.

మాస్టర్ మహాశయులకూ, నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధుపుంగవులకూ, కొన్నేళ్ళ తరవాత నేను ఒక పాశ్చాత్యదేశంలో, దైవభక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసే ఉండవచ్చుననిపిస్తోంది. ఆయన దయను గురించి నిస్సారమైన మాటల్లో రాయడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు. వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయ మేమీ కాదు; అలాగే ఇంతవరకు చదువుతూ వచ్చిన నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించదనుకుంటాను.

సరళమైన విశ్వప్రేమమయ భావనద్వారా, అన్ని మతాల సాధువులూ దైవసాక్షాత్కారం పొందారు. కేవల పరబ్రహ్మ నిర్గుణం, అంటే “గుణాలు లేనిదీ,” అచింత్యం, అంటే “ఆలోచనకు అందనిది,” కావడంవల్ల, మానవుల ఆలోచనా ఆకాంక్షా ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒకమూర్తిమత్వమిస్తూ వచ్చాయి. వేదాల్లోనూ , భగవద్గీతలోనూ వివరించిన విధంగా, సాకారదైవ భావననూ కేవల నిరాకారబ్రహ్మ భావననూ సమ్మేళనంచేయడం, హిందూతత్త్వ చింతన సనాతన కాలంలోనే సాధిం