పుట:Oka-Yogi-Atmakatha.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

143

ఎడ్లబండ్లూ, ఇనప పట్టాలున్న జట్కా బండ్లూ- అన్నీ చడీ చప్పుడూ లేకుండా సాగిపోతున్నాయి. సర్వవ్యాపకమైన దృష్టి ఉన్నట్లుగా నేను, నాకు వెనకవేపూ పక్కలా ఉన్న దృశ్యాల్ని కూడా, ఎదురుగా ఉన్నవాటి మాదిరిగానే చూశాను. కలకత్తాలో ఆ చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళముందు నిశ్శబ్దంగా సాగిపోతోంది. పలచని బూడిద పొరకింద మసకమసకగా కనిపించే నిప్పుకణంలాటి మృదుకాంతి ఒకటి పరిసర దృశ్యంలోకి ప్రవేశించింది.

నా శరీరం, అనేక మైన నీడల్లో ఒక నీడలా తప్ప, అంతకుమించి గోచరించలేదు. అయితే తక్కిన నీడలు మూగగా ముందుకూ వెనక్కూ చెదిరిపోతూ ఉంటే, నా నీడ మాత్రం నిలకడగా ఉంది. కొందరు కుర్రవాళ్ళు నా స్నేహితులు, నావేపు వచ్చికూడా ముందుకు సాగిపోయారు. వాళ్ళు సూటిగా నావేపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు.

ఈ అనుపమ ఛాయాప్రదర్శన నాకొక అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించింది. ఏదో ఊటచెలమలోంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను. ఇంతలో హఠాత్తుగా, మాస్టర్ మహాశయులు నా రొమ్ముమీద తట్టినట్లు తెలిసింది. నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్ళీ చెవుల్లో పడింది. కలలో తేలిపోతూండె వాణ్ణి నిర్దయగా మేల్కొలిపినట్లుగా అల్లాడిపోయాను. అతీంద్రియానంద మధువును నాకు అందకుండా దాచేశారు.

“చిన్న బాబూ, నీకు రెండో బై స్కోపు[1] నచ్చినట్టు కనిపిస్తోంది.”

  1. వెబ్‌స్టర్ న్యూ ఇంగ్లిష్ డిక్‌ష్ణరీ (1934) లో బైస్కోపు (bio-scope) అన్న పదానికి అరుదైన నిర్వచనం ఉంది: “జీవిత దృశ్యం; అటువంటి దృశ్యాన్ని కల్పించేది.” దీన్నిబట్టి, మాస్టర్ మహాశయులు ఎన్నుకున్న పదం చిత్రంగా నప్చింది.