పుట:Oka-Yogi-Atmakatha.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 9

ఆనందభరిత భక్తుడు,

ఆయన విశ్వప్రేమలీల

“చిన్నబాబూ, కూర్చో. నా జగన్మాతతో మాట్లాడుతున్నాను.”

అత్యంత శ్రద్ధాభక్తులతో నేను నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించాను. మాస్టర్ మహాశయుల దివ్యదర్శనం నన్ను చకితుణ్ణి చేసింది. పట్టులాటి తెల్లటి గడ్డంతోనూ మిలమిల మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన, పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాసించారు. పైకెత్తి ఉన్న చిబుకమూ జోడించి ఉన్న చేతులూ చూడగానే, నే నక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమయింది.

సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు, నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమయిన వాటన్నిటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవడంతో, ఎడబాటువల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు, జగన్మాతతో ఎడబాటు కలిగిందే అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేలమీద ఒరిగిపోయాను.

“చిన్నబాబూ, మనస్సు కుదుటపరుచుకో!” అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయినవాడిలా ప్రాణం దక్కించుకోడానికి, వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను.