పుట:Oka-Yogi-Atmakatha.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

ఒక యోగి ఆత్మకథ

“మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చెయ్యాలి! జగన్మాతకు నామీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి!”

ఒకరి గురించి తాను కలగజేసుకొని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. ఆయన మౌనం వహించారు.

మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో, ఈ సాధుపు నిర్దుష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన, దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీమరీ వేడుకున్నాను.

“నీ కోరిక జగన్మాతకు విన్న విస్తాను,” మాస్టర్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పుదల తెలిపారు.

ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని! తుఫానులో ఒంటరిగా చిక్కుపడ్డ నాకు విముక్తి అనుభూతమయింది.

“మహాశయా, మీ రిచ్చిన మాట మరిచిపోకండి! అమ్మవారి జవాబుకోసం మళ్ళీ త్వరగానే వస్తాను!” ఒక్క క్షణం క్రితం, కట్టలు తెంచుకువచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతులో ఇప్పుడు ఆశావహమైన ఆనందం ధ్వనించింది.

పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను. మాస్టర్ మహాశయుల ప్రస్తుత నివాసం- అమ్హరెస్ట్ వీధిలోని 50 నంబరు ఇల్లు- ఒకప్పుడు మేం ఇంటిల్లిపాదీ ఉన్న ఇల్లు; అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మకోసం నా మానవ