పుట:Oka-Yogi-Atmakatha.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిలో తేలే సాధువు

109

యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను.

“ఎంత బాగా నవ్వుతావో!” అన్నారు. ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తళుక్కుమంది. ఆయన ముఖమయితే ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది; కాని ఆనంద పారవశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రవ్వంత పొడగడుతూ ఉంటుంది. సువిశాలమైన ఆయన నేత్ర పద్మాల్లో దివ్యహాసం దాక్కొని ఉంటుంది.

“ఆ ఉత్తరాలు, ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి.” బల్లమీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ అన్నారాయన. “యోగం మీద ఆసక్తి గల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్న ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానమున్న ఆ సభ్యులు, భారతదేశాన్ని కొత్తగా కనుక్కొంటున్నారు! వాళ్ళకి సాయం చెయ్యడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెల్తురు లాగే, యోగశాస్త్ర జ్ఞానం కూడా, పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగా లభిస్తుంది.

“మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించినదాన్ని పాశ్చాత్యుల కోసం పలచన చెయ్యనక్కర లేదు. బాహ్యానుభవం వేరయినా ఆత్మమట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కాని, ప్రాచ్యదేశాలవాళ్ళు కాని క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చేయ్యకపోతే బాగుపడరు.”

ఆ యోగి ప్రశాంతమైన కళ్ళతో నన్ను ఆకట్టుకొన్నారు. ఆయన, మాటల్లో, భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు. ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్య బోధలను అమెరికాకు తీసుకు వెళ్తానని, తరచుగా మాట వరసకు చేసే