పుట:Oka-Yogi-Atmakatha.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

ఒక యోగి ఆత్మకథ

“భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు, ఎవరూ అనుకోని చోట పుట్టిస్తాడు; లేకపోతే ప్రజలు, తన నొక నియమానికి పరిమితం చేసేస్తారని.”

ఆ సాధువు, చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు. డెబ్బయ్యో పడిలో పడ్డ ఆయనలో, వయస్సు పైబడ్డం వల్ల కాని ఎప్పుడూ కూర్చునే ఉండడంవల్ల కాని మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలేవీ కనబడవు. దృఢంగా, నిటారుగా ఉండే దేహం. ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి. సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా, ఆయన ముఖం ఋషినే తలపిస్తుంది. ఉన్నతమైన శిరస్సుతో, ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన, ఎప్పుడూ వెన్ను దృఢంగా, నిటారుగా నిలిపి ఆసీనులయేవారు; ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి.

ఆ స్వామివారూ, నేనూ ధ్యానస్థితిలోకి వెళ్ళాం. ఒక గంట తరవాత ఆయన మృదుస్వరానికి నాకు స్పృహ వచ్చింది.

“నువ్వు తరచుగా మౌనంలోకి వెళ్తూ ఉంటావు; కాని అనుభవం[1] సంపాదించావా?” ధ్యానం కన్న భగవంతుణ్ణే ఎక్కువగా ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తుచేశారు. సాధన పద్ధతినే లక్ష్యమనుకుని పొరపాటు పడకు.”

ఆయన నాకు కొన్ని మామిడిపళ్ళు పెట్టారు. ఆయన గంభీర స్వభావంలోనే నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్య ప్రియత్వం ఉంది. ఆ ధోరణిలో ఆయన ఇలా అన్నారు : “జనానికి సాధారణంగా, ధ్యానయోగం (భగవంతుడితో కలయిక) కంటె జలయోగం (తిండి తినడం) అంటేనే ఇష్టం.”

  1. భగవంతుణ్ణి యథార్థంగా దర్శించడం.