పుట:Oka-Yogi-Atmakatha.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

99

మాత్రుడొకడు, పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చెయ్యడానికి సాహిసించడమా! అవమానానికి గురి అయిన పులులన్నిటి విద్వేషవిషమూ సాంద్రీభూతమయి ఏర్పడ్డ శక్తికి, గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి, పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందనీ పల్లెప్రజలు ప్రకటించారు.

“మనిషికీ మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు. వేలకొద్ది ప్రేక్షకజనం పట్టడానికి వీలయిన డేరా, ఆయనే దగ్గరుండి వేయించాడట; తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజా-బేగం ఉంది; బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటయి ఉంది. బోనులో బందీగా ఉన్న పులి, నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో బాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాతడపా పెడుతూ వచ్చారు. బహుశా, నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకొని ఉంటాడు ఆ యువరాజు!

“సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల, నగరంలోవాళ్ళూ బయటివాళ్ళూ కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగేనాడు, వందలాది జనం, టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది, డేరా కంతల్లోంచి చొరబడి గేలరీల కింద ఉన్న చోటకు చేరి కిక్కిరిసిపోయారు.”

టైగరు స్వామి కథ మంచి పట్టులోకి వస్తూంటే, నాలో ఉద్రేకం పెల్లుబుకుతూ వచ్చింది; చండి కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు.

“ఒక పక్క రాజా - బేగం చెవులు చిల్లులుపడేలా గర్జిస్తోంది; మరోపక్క, కొంచెం కంగారుపడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకొన్న