పుట:Oka-Yogi-Atmakatha.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ఒక యోగి ఆత్మకథ

చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను. మనిషి నెత్తురు పసిగట్టింది పులి. చువ్వలు ఫెళఫెళలాడేటంతగా రొద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలీ భయమూ కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది-- మహోగ్రమైన క్రూరమృగం ముందు నే నొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను.

“ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను; కాని నేను తలుపు మూస్తూ ఉండగానే రాజా-బేగం నిలువునా నా మీదకి వచ్చిపడింది. నా కుడిచెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నిటికంటె ఇష్టమైన మానవరక్తం చేతినుంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది.

“అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపుదెబ్బ తిన్నట్టయి, తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా ఉండాలని, అంగోస్త్రం కింద పెట్టేశాను. ఎడమచేత్తో విసురుగా, ఎముకలు విరిగేలా ఒక్క గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనకతట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదటికి వచ్చింది. పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు; ఆ పిడుగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను.

“చాలాకాలం పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే, మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో, రాజా-బేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్యమధ్య చెవులు గళ్ళుపడేలా గాండ్రిస్తూ, కోపంతో రెచ్చిపోతూ నామీద విరుచుకు పడింది. వాడిగా ఉన్న పంజాలూ