పుట:Oka-Yogi-Atmakatha.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ఒక యోగి ఆత్మకథ

కూలబడ్డాడు; ఆయన్ని చూస్తుంటే, క్రైస్తవుల్ని క్రూరమృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు. ఆయన ఇలా అన్నాడు:

“ ‘పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను.’

“ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో, రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో, నాకు తెలియదు!”

“రాజప్రాసాదంనుంచి బయటికి వస్తూ, అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం, సర్వాంగకవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి, నాలో నేను నవ్వుకున్నాను.

“మరుసటి వారమంతా, రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్నీ మనస్సునూ క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్న గారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కాని, ప్రచారమైనకొద్దీ చిలవలూ పలవలూ వేసింది. దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షసరూపాలు దాలుస్తుందనీ, పగలు మట్టుకు చారల పులిలాగే ఉంటుందనీ అమాయకులైన గ్రామప్రజలు నమ్మారు. నన్ను అణగదొక్కడానికి ఏర్పాటయినది ఆ రాకాసిపులేనని భావించారు.

“వాళ్ళ ఊహల్లో అల్లుకొన్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజా-బేగం అవతరించిందట. పులిజాతి కంతకూ తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట! జూలులేని, కోరలులేని మానవ