పుట:Oka-Yogi-Atmakatha.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“గంధబాబా” అద్భుతాల ప్రదర్శన

81

“పూలు వాడిపోతే సువాసనలు పోతాయి.”

“చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నే నెందుకు కోరుకోవాలి?”

“వేదాంతిగారూ, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు.” ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన.

నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరిలో మరొక రెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు.

“నీకు ఏం వాసన కావాలి?”

“గులాబి.”

“అదే వచ్చుగాక.”

నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబి వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరిలో ఉన్న ఒక పూలకుండీలోంచి, వాసనలేని పెద్ద పువ్వు ఒకటి తీశాను.

“వాసనలేని ఈ పువ్వుకి మల్లి పువ్వు వాసన తెప్పించవచ్చాండీ?”

“అదే వచ్చుగాక.”

వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లిపువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి, ఆయన శిష్యుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పాడు- గంధబాబాగారి సరైన పేరు స్వామీ విశుద్ధానందగారట. ఈయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర, ఆశ్చర్యకరమైన అనేక యోగరహస్యాలు తెలుసుకొన్నారట. ఆ టిబెట్టుయోగి వయస్సు వెయ్యేళ్ళకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు.