పుట:Oka-Yogi-Atmakatha.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ఒక యోగి ఆత్మకథ

“ఎందుకండి?” ఆయన నన్నలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు.

“అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే ఆనుభవం పొందడానికి.”

‘‘వాసనల కోసం దేవుణ్ణి వాడుకోడమా?”

“అయితేనేం? దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా, సువాసనలు.”

“ఔననుకోండి; కాని ఆయన, మనం తాజాగా వాడుకోడానికి తరవాత పారెయ్యడానికి వీలయిన సున్నితమైన పూలు సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు?”

“ఆ; కాని మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబూ!”

“అయితే సెంటు ఫ్యాక్టరీవాళ్ళ వ్యాపారం పడిపోతుంది.”

“వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకోనిస్తాలే! భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశం.”

“అయ్యా, భగవంతుణ్ణి రుజువు చెయ్యడం అవసరమాండీ? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతిచోటా అద్భుత శక్తులు చూపించడం లేదా?”

“ఔననుకో. కాని మనం కూడా, ఆయనకు గల అనంతమైన సృజనశక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి.”

“మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండీ?”

“పన్నెండేళ్ళు.”

“సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చెయ్యడానికా! మహాశయా, కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు పన్నెండేళ్ళు వృథాచేస్తూ వచ్చారని నా కనిపిస్తోంది.”