పుట:Nutna Nibandana kathalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాధి దగ్గరకు వచ్చారు. దేవదూత దిగివచ్చి మూతగా వున్నరాతిని దొర్లించి దానిమీద కూర్చున్నాడు. అతన్ని చూచి కావలివారు భయపడి పారిపోయారు. దూత ఆ స్త్రీలతో యేసు ఉత్థానమయ్యాడు. మీరు వెళ్లి శిష్యులకు ఈ విషయం తెలియజేయండి అని చెప్పాడు. ఆ స్త్రీలు వెళూండగా ఉత్థాన క్రీస్తు వారికి కన్పించి గలిలయలో తన్ను కలుసుకోవాలని శిష్యులకు చెప్పమని ఆదేశించాడు. ఇక్కడ కావలివాళ్లు ప్రధానార్చకుల దగ్గరికి పోయి జరిగిన సంగతంతా తెలియజేశారు. ఆ నాయకులు వారికి లంచం పెట్టి మీరు శిష్యులు వచ్చి రాత్రివేళ యేసు శరీరాన్ని దొంగిలించుకొని పోయారని చెప్పండి అని ఆదేశించారు. కావలివాళ్లు ఆలాగే చేశారు.

82. పేతురు, యోహాను సమాధిని దర్శించడం - యోహా 20,1-40

ఆదివారం ఉదయం మరియ మగ్డలీన సమాధి దగ్గరికి వెళ్లి రాయి తొలగింపబడి వుండడం చూచింది. ఆమె పేతురు యోహానుల దగ్గరికి వెళ్లి యేసుదేహం సమాధిలో లేదని చెప్పింది. శిష్యులిద్దరూ సమాధి దగ్గరికి పరుగెత్తుకొని వచ్చారు. యోహాను మొదట సమాధిని చేరాడుగాని లోనికి వెళ్లలేదు. తర్వాత పేతురు వచ్చి లోనికి పోయాడు. అక్కడ ప్రేతాన్ని కప్పిన నారవస్తాలు కన్పించాయి. తలకు చుట్టిన తుండగుడ్డను ఒక వైపున మడిచి వుంచారు. అక్కడ ఏమి జరిగింది పేతురికి అర్థం కాలేదు. అతని తర్వాత యోహాను కూడ సమాధిలోకి వెళ్లాడు. అతడు క్రీస్తు ఉత్థానమయ్యాడని నమ్మాడు. ఎందుకంటే దొంగలు వచ్చి దేహాన్ని ఎత్తుకొని పోయినట్లయితే గబగబ వెళ్లేవాళ్లు. తుండుగుడ్డను నిదానంగా మడిచి ప్రక్కనపెట్టరు. కనుక దేహాన్ని దొంగలు ఎత్తుకొని పోలేదు, ప్రభువు నిజంగానే ఉత్థానమయ్యాడు అని తెలిసికొన్నాడు. ఆ పిమ్మట శిష్యులిద్దరు తిరిగిపోయారు.