పుట:Nilagiri yathra.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

" నీలగిరి యాత్ర " వచనరూపమున నున్నను పద్య కావ్య సంప్రదాయము ననుసరించి యాశ్వాసాద్యంత పద్యములు రచింపబడినవి. వానిలో గర్భకవిత్వము బంధకవిత్వము గల వృత్తములు గలవు. కృతి భర్తృ వంశావతారికయు పద్యరూపముననే గలదు. దీనిని బట్టి శేషాచల కవి గద్య రచనయందే కాక పద్య రచన యందుగూడ ప్రవీణుడని విశదమగుచున్నది.

ఇందలి వచన రచన ప్రశస్తమగు గ్రాంథిక శాలినున్నది. అందందు వ్యవహారానుగుణముగ నా కాలమునందలి రాజకీయ ప్రభావము ననుసరించి యన్యదేశ్యములును వాడబడియున్నది. ఇది యాత్రా చరిత్ర కావున యాయా ప్రదేశముల యందు వ్యవహారములోనున్న పదములకు వాని ప్రత్యేకమైన యుచ్చారణ తెలియునట్లు కొన్ని గుఱుతులు కూడ నిందు పెట్టబడినవి. కేవల ద్రవిడ పదములను నేఱుగా కవి సూచించియున్నాడు. దీనివలన నియమబద్ధమగు గ్రాంథిక రచనయందు నన్యదేశముల నెట్లు జొనుపవచ్చుననునది దృష్టాంతీకరింపబడినది.

శేషాచల కవి తన ప్రయాణమున తగిలిన కంచి, వేలూరు, సేలము, కోయంబత్తూరు, మోటుపాళయము మున్నగు ప్రదేశాములందు తాను చూచిన జంతు వృక్ష క్రిమికీటకాదులను, అందందు నివసించుచున్న జనుల భాషను, ఆచార వ్యవహారములను, మార్గమధ్యమందలి యాటవిక జీవనమును, అందలి మృగములను, వానిని వేటాడు విధానమును, విపులముగా వర్ణించియున్నాడు. మఱియు విషయములు సులభముగా హృదయ గతమగుటకు నొక చిత్రమును గూడ లిఖించియున్నాడు. ఇంతియేకాక భూగోళశాస్త్ర విషయములను, వాతావరణాది సూచనలను కూడ యిందు జొనిపియున్నాడు. తన కాలమందలి ప్రజల నిత్య జీవితమును చక్కని వాజ్మయ రూపమున రచన గావించిన కవులలో నీత డద్వితీయుడు. " కవి ప్రజలలో నొకడ " ను సిద్ధాంతము ప్రచురముగా నున్న యీ కాలమున నీలగిరి యాత్ర కొన్ని వెలుగు బాటలను చూపకపోదు.

ఆధునిక కాలమున పరవస్తు చిన్నయసూరి " నీతి చంద్రికయే " గ్రాంధిక వచన రచనకు మార్గదర్శకమైనదని కొందఱు విమర్శకుల యభిప్రాయము. కాని నీలగిరి యాత్ర రచనము నీతి చంద్రిక కన్న పదేండ్లు పూర్వము కాబట్టి యా మార్గదర్శకత్వము శేషాచల కవికే చెందవలసియున్నది. వచన యుగమని ప్రసిద్ధి గాంచి వచన రచనలకు ప్రాధాన్యముగల యీ దినములలో నిట్టి ప్రశస్త వచన రచన విశ్వవిద్యాలయాధికారులకును విద్యాశాఖవారికిని విద్వల్లోకమునకును విశేషముగ నాదర పాత్రమగుననుటలో సందియము లేదు.

దీనికి ముద్రణ ప్రతిని సిద్ధపరచిన తాత్కాలికాంధ్ర పండితురాలగు శ్రీమతి బి. ఆదిలక్షమ్మగారిని, ప్రూఫులను పరిష్కరించిన ఆంధ్ర పండితులు శ్రీయుతులు సాళ్వ కృష్ణమూర్తి, ఎం.పి., గారిని అభినందించుచున్నాను.

టి. చంద్రశేఖరన్.