పుట:Nilagiri yathra.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

మదరాసు దొరతనమువారి ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమునందలి వచన కావ్యములలో నీ నీలగిరి యాత్రా చరిత్ర D. Vo. VI. 1466-A సంఖ్యలో వర్ణింపబడినది. కాగితపు బ్రతి. దీనికీ గ్రంథాలయమున బ్రత్యంతరము లేదు. వ్రాత సుందరముగా నున్నది. ముఖపత్రమున " గిల్టు " చేయబడిన " శ్రీ మత్కృతి పతులగు గోడే వేంకట జగ్గారాయలుగారికి కోలా శేషాచలం కవి వలన సమర్పితంబగు నీలగిరి యాత్ర " అను నీ వ్రాతవలన నీ ప్రతి, కవి స్వహస్తసంపాదితమై యుండ నోపునని పొడకట్టుచున్నది. అవతారికలో 2 పుటల గ్రంథ పాతము గలదు.

నీలగిరి యాత్ర యను నీగ్రంథము నీలగిరి యాత్రా చరిత్రలకు సంబంధించినది. మదరాసు దొరతనమువారు పూర్వము విటేటసు వేసవిలో తమ పరివారముతో నీలగిరికి వెళ్ళుట యాచారమై యుండెడిది. క్రీ. శ. 1846 వ సంవత్సరమున నప్పటి గవర్నరగు " ట్సీ డెర్ " దొరగారు తమ కార్య నిర్వాహక వర్గముతో గూడ నీలగిరికి పయనమైరి. ఆ కార్య నిర్వాహక వర్గములో వొకడగు " తామస్ సిమ్సన్ " అను దొరవారి యాఫీసున ప్రధానోద్యోగి యగు మాంగాడు శ్రీనివాస మొదలారి యను, గుమస్తాగానున్న ప్రకృత గ్రంథకర్తయగు కోలా శేషాచల కవియు నా పరివారముతో నీలగిరికి వెళ్లిరి. శేషాచల కవి క్రీ. శ. 1846 మే 12 వ తేదీని చెన్నపురినుండి బయలుదేరి యెనిమిది నెలలుండి తిరిగి క్రీ. శ. 1847 జనవరి 13 వ తేదీని మదరాసు చేరుకొనెను. ఈ కాలములో శేషాచల కవి తన ప్రయాణమును గూర్చి తెలుపుచు, నీలగిరిలోని విశేషములను తన యనుభవములను సేకరించి పై గ్రంథమును రచించెను.

కృతికర్తయగు శేషాచల కవి చెన్నపట్టణమునందలి చింతాద్రిపేట నివాసి. ఇతడు తన వంశమును గురించి గ్రంథాంతమున చెప్పుకొని యున్నాడు. ఇతడు యాదవ కుల సంజాతుడు. కోలా వీరరాఘవునకు ప్రపౌత్రుడు. తెప్పలనాయకునికి పౌత్రుడు. వెంకటాచల నాయనికి మంగమకు పుత్రుడు. తన తాత ముత్తాతలనే కాక బంధుజాలమంతటిని సీసమాలికలో వర్ణించియున్నాడు. ఇతడు విశిష్టాద్వైత సంప్రదయానుగామి. గణిత శాస్త్రమును మాంగాడు శ్రీనివాస మొదలారియొద్ద నేర్చుకొన్నట్లు చెప్పుకొనియున్నాడు.

ఈ గ్రంథము దప్ప యీతని రచనలేమియు గాంపించుట లేదు.

దీనిని కవి విశాఖపట్టణమున సుప్రసిద్ధములైన జమీందారి కుటుంబములలో నొకటియగు గొడే కుటుంబమున నుద్భవించిన శ్రీ వెంకటా జగ్గారాయ నృపాలుని కంకితము చేసియున్నాడు. కృతిపతియగు నీ వెంకట జగ్గారాయడు భూగోళ, ఖగోళ, జ్యోతిశ్శాస్త్రములయందు ప్రవీణుడాఇ విశాఖపట్టణమున నొక నక్షత్ర శోధన శాలను (observatory) నిర్మించెను. మఱియు నీతడు సంగీత సాహిత్యములందభినివేశము గలవాడై నందుననే శేషాచల కవి యీ గ్రంథము నీతని కంకిత మొనర్చుట ప్రసక్తమై యుండును.

ఈ గ్రంథము మూడు ప్రకరణములది. ప్రథమ ప్రకరణ మీతడు నీలగిరి చేరునంతటి వరకుగల వృత్తాంతమును తెలుపును. రెండవ ప్రకరణము నీలగిరియందలి విశేషములను తెలియజేయుచున్నది. మూడవ ప్రకరణము నందాతని తిరుగు ప్రయాణమును గూర్చియు త్రోవయందలి యద్భుతములను గురించియు వర్ణింపబడియున్నది.