పుట:Neti-Kalapu-Kavitvam.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

|ప్రకాశాధికరణం.

పూర్వపక్షం.

మీరు గుణాలు కనబరచలేదు. మీరుదోషాలు ప్రదర్శిస్తున్నారు. దోషాన్వేషణం మంచిదిగాదు. శివుడు విషం కంఠంలోఉంచి ప్రకాశానికి తీసుకొనిరాక చంద్రుణ్ని నెత్తినపెట్టుకొని ప్రకటిస్తున్నాడు. అట్లా మీరు దోషాలను దాచవలసింది. కాని దోషాలను ప్రకటిస్తున్నారు. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. శివుడి ఉదాహరణం యాచకులు దానానికి పోయినప్పుడు దోషాలేమైనావుంటే క్షమించి మాగుణాలకే మెచ్చుకొని దానంజెయ్యమని చెప్పడానికి పనికివస్తుంది. శరణాగతులను కాపాడేటప్పుడు వారిదోషాలను గణించ నవసరంలేని సమయం వస్తుంది. అట్లాటి సందర్భాల్లో దోషాన్వేషణం అనావశ్యకం అందుకే

"దోషో యద్యపి తస్య స్వాత్ సతామేతదగర్హితం" (రా)

అని విభీషణుడి విషయంలో శ్రీరాము డంటాడు. కాని కావ్యవిచారణలో దోషనిర్ణయం అవశ్యకమే అవుతున్నది. కాకుంటే సాహిత్య గ్రంథాల్లో దోషప్రకరణమే అనుచితమై వుంటుంది.

"తదల్పమపి నోపేక్ష్యం కావ్యే దుష్టం కదాచన
 స్యాద్వపుః సుందరమపి శ్విత్రేణైకేన దుర్బగం." (కా ద)