పుట:Neti-Kalapu-Kavitvam.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


కొత్తపేర్లు పెట్టడమయినా అవుతవి. లేదా యిదివరకు తెలిపినట్లు అయోమయపు అసంబద్ధవచనాలైనా అవుతవి. ఆత్మల సంయోగం వుండనీయండి? అబిమానం వుండనీయండి? ఆభిమానం వుండనీయండి? ఆరాధనం వుండనీయండి? యేమైనా వుండనీయండి? సాధారణంగా ప్రియులైన స్త్రీ పురుషుల కలయిక నుండి స్త్రీత్వపురుషత్వాలసత్తను వేరుచేయలేమంటున్నాను. సాహిత్య వేత్తల స్త్రీపురుషసాధారణ్య రూపమైన ఈ స్త్రీత్వపురుషత్వాలు నిర్మలోపాధితోకూడినప్పుడు వాటి కలయిక లోకాభ్యుదయ హేతువవుతున్నది. హేయోపాధులతో కూడినప్పుడు అనర్థహేతువవుతున్నది. ప్రాకృతుల శృంగారంయొక్క అనుపాదేయత తెలిపినాను. అనౌచిత్య ప్రవృత్తమైన పరకీయారత్యాది శృంగారాభాసానికి దుష్టశృంగారానికి ఇక్కడ ప్రసక్తి లేదు గనుక దాన్ని విచారించలేదు అశ్లీలసురతాదులు, గ్రామ్యవృత్తులు వెగటుగా ప్రధానంగా వర్ణించడం యెందైనా ఔచిత్య పరిపాలనానికి త్యాజ్యమనే సంగతి నైషధతత్వజిజ్ఞాసలో విశదం చేశాను. కనుక ఆమీమాంస వదలుతున్నాను.

శృంగారం సాధారణుల్లో కేవలకాముకుల్లో కలియడం కులకడం, తహతహ పడడం మొదలైన ముడిపనులనే వెలువరిస్తుందని తినడం, కనడం. పరమార్థంగా వుండే వృత్తి అనుపాదేయమని యిదివరకే విశదం చేశాను. శృంగారం ఆధారంగా ఆనందమేగాక ఉదాత్త భావోన్మిలనం వీరత్వతేజశ్శాలిత్వాదులమీద అనురక్తీ వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ ఆనుషంగిక ఫలాలుగా సిద్ధించినప్పుడే అది గ్రాహ్యమని. పరిణత నాయకులందే ఆదశ సిద్ధిస్తున్నదని చెప్పినాను. ప్రకృతానికి వస్తాను.

సాధారణుల జానపదుల ధర్మసంబంధిగాని కామప్రేమ ఈతీరుగా ఉదాత్తప్రేమవలె ముఖ్యమైనది గాదు. అయితే అమాయికులయిన ప్రాకృతులప్రేమ కొంతవరకు మనోహరంగానే వుంటుంది. కనుకనే భారతీయులు దీనిని వదలక కావ్యంలో అప్రధానంగానైనా స్వీకరించాను.