పుట:Neti-Kalapu-Kavitvam.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

పులుముడుఘటనాధికరణం.

పులమడం.

నేటి కాలపు కవిత్వంలో పులమడం విశేషంగా కనబడుతున్నది. పులమడమనేది గొప్ప కావ్యదోషం. దీన్ని ముందు వివరిస్తాను. తేలిక రంగులతో కొద్దిగీతలతో గొప్పభావాలను ప్రకటించే చిత్రకారుడివలె. కవి, చెప్పినమాటల అర్థంకంటె ఆమాటవల్ల స్ఫురించే భావ విశేష పరంపర అమేయమై వుండేటట్లు గోచరింపజేస్తాడు.

"ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ."
 లీలా కమలపత్రాణి గణయామాస పార్వతీ." (కుమా.)

(దేవర్షి నారదుడు పార్వతీపరమేశ్వరుల వివాహప్రశంసచేయగా తండ్రి పార్శ్వాన కూర్చున్న పార్వతి తలవంచి చేత్తో లీలారవిందపు రేకులు లెక్క పెట్టింది. ) అన్నప్పుడు పార్వతి లజ్జా, ఆమాటలు వినడం వల్ల ఆమెకు కలిగిన ఆనందం, ఆమె సౌశీల్యం, వినయసంపదా, ఆత్మనిగ్రహం, భవిష్యత్సంయోగదర్శనచిత్తప్లుతీ, యేతజ్జాతీయమనోవిభ్రమాలెన్నో గోచరిస్తున్నవి.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం,
 శ్రితాసి చందన భ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

("ఓముగ్ధా! అపూర్వకర్మ చండాలుణ్నైన నన్నిఘవదలు. చందన మనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు" అని రాముడు తొడమీద నిద్రిస్తున్న సీతను జూచి అన్నప్పుడు రాముడి ధర్మపరత్వం సీతావియోగదుఃఖం, ధర్మంయొక్క నిష్ఠురత్వం, లౌకిక సుఖోపలబ్దికోరే వారు ధర్మారాధనలో పొందే ఆశాభంగం, విధియొక్క అజ్ఞాతపరిణామ