పుట:Navanadhacharitra.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

నవనాథచరిత్ర

విపుల సౌరభ సమ ◆ న్విత గంధవాహ
వాసిత దశదిశా ◆ వలయంబు నగుచు
భాసిల్లు నిజసభా ◆ భవనంబునందు
శ్రీసముజ్‌జ్వల రత్న ◆ సింహాసనమున
నాసీనుఁ డై బిరు ◆ దందె [1] బాగొందఁ
దాఁచిననీలాల ◆ తళుకు లొక్కింత
చాఁచిన నిజ వామ ◆ చరణాబ్జమునకు
మసలక మ్రొక్కెడు ◆ మండలేశ్వరుల
పసగల కోటీర ◆ పద్మరాగములఁ
బరగు క్రొమ్మించుల ◆ పైని రాణింప
నరుదైనపసిఁడి హం ◆ సావళి నన్నె
జిగి ధగధగ యను ◆ చీనాంబరంబు
మిగులఁ దీర్చిన కాసె ◆ మీఁదఁ జెన్నొందఁ
గట్టిన రత్నాల ◆ కటిసూత్ర రుచులు
దట్టమై [2] నిగిడి మ ◆ ధ్యము చుట్టిపాఱఁ
గలికి రాచిలుక ఱె ◆ క్కల చాయ ఠేవ
గలుగు పచ్చలపద ◆ కంబు సొంపెసఁగఁ
గళఁ దులకించు చు ◆ క్కలతోడ మాఱు
మలయు మౌక్తిక కంఠ ◆ మాలిక మెఱయఁ
గరభూషణంబులఁ ◆ గలవజ్రరుచులు
పరగి నభోమణి ◆ ప్రభలపై నణఁగ
ధళధళ మను నవ ◆ తంస మాణిక్య
లలిత కాంతులు కపో ◆ లములపైఁ బొలయ
సవరగాఁ జుట్టిన ◆ జడల నెట్టెమునఁ
జివురుఁగెంజాయ మిం ◆ చిన పాగ మెఱయఁ
బొలుపుగాఁ గర్పూర ◆ మున మేళవించి
పలుచగా నలఁదిన ◆ భసితాంగరాగ
సన్నుతోజ్జ్వల కాంతి ◆ చంద్రికల్ జనుల
కన్నుఁ గవలకు వి ◆ కాసంబు నెరపఁ
బ్రమథ వర్గము గొల్వ ◆ రజతాద్రిమీఁదఁ
బ్రమద మారఁగ నున్న ◆ పరమేశుఁ డనఁగ
మహిఁ బేరు (గన్నట్టి ◆ మహితాత్ముఁ గొల్చి)

  1. ఁబొగడొంద.
  2. నిగుడి.