పుట:Narayana Rao Novel.djvu/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
96
నారాయణరావు

నారా: చిత్తం.

లక్ష్మీ: మావాడు మనకు ఆంధ్రరాష్ట్రం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర హైకోర్టు అన్నీ కావాలనే రకమేనండి. ఆంధ్రప్రతిభ, ఆంధ్ర పౌరుషము, ఆంధ్రవిజ్ఞానము తలుచుకు తలుచుకు పరవశుడౌతాడు. నేడు ఆంధ్రదేశ దురదృష్టం వల్ల ఆంధ్రులెవ్వరూ ఏ విషయంలోనూ ఆంధ్రదేశంలో ఉన్నంత కాలం పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలేదని విచారిస్తాడు.

పరం: ఆ! ఆంధ్రదేశానికి కుజుడో శనో రాజ్యం చేస్తూ ఉన్నాడు, లేకపోతే, పూర్వకాలంలో కోటీశ్వరులున్న దేశంలో నేడు పదిలక్షలున్న సాహుకార్లరుదు. మహారాజులు కవితాపోషకులై కృతులు గొన్న కాలం పోయి కవిత్వం పేరు చెప్పితే నిరసించే దిక్కుమాలిన కాలం వచ్చింది. అమరావతిలో నాగార్జున మెట్టలో, ఒరంగల్లులో, హంపిలో, మహాబలేశ్వరంలో విరిసిపోయిన శిల్పం నేడు నామమాత్రావశిష్టం అయింది. ఇంక ఎవరికైనా పేరొచ్చింది అంటే దేశం విడిచి వెళ్లారుగనుక. విశ్వదాత నాగేశ్వరరావు గారు, ఆచార్య రాధాకృష్ణ గారు, నాగపురంలో లక్ష్మీ నారాయణ గారు, నియోగి గారు, చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి గారు దేశాలు విడిచి వెళ్లి మహోన్నత పదవులకు వెళ్లారు. బొంబాయి కామాఠీలని, రంగూనులో గౌడ రెడ్లనీ, నాగపురంలో నాయుళ్లనీ ప్రఖ్యాతిగన్న వారంతా యిలా తెలుగుగడ్డ విడిచి వెళ్లిన వారే.

రాజేశ్వర రావు: జిడ్డు కృష్ణమూర్తి గారో?

పరం: అవును. ప్రపంచవిఖ్యాతిగన్న మహాజ్ఞాని.

రాజే: తర్వాత వారిలో పండిత వంగల శివరాము, పున్నయ్య గారు. ఇంకా ముఖ్యులు ఇంజనీరు విశ్వేశ్వరయ్య, దివాను నాగుమయ్య . పరం: అదేనండి ! చిన్న చిన్న వాళ్లై కూడా దేశం విడిచిపోతే మన ఆంధ్రులు బయటికి వస్తారండి. దామెర్ల రామారావును చూడండీ!

లక్ష్మీపతి: ఆంధ్రదేశం వదిలితే అరవగ్రహ బాధ వదిలి పైకి వస్తారోయి పరమేశ్వరం.

జమీం: పరమేశ్వరమూర్తి గారూ! మీరు చెప్పినదానిలో సత్యం ఉన్నట్లే తోస్తున్నది. కారణం మీరు చెప్పింది కాకపోవచ్చును. యశం సంపాదించుకోవాలంటే మనం మన దేశమేకాదు మద్రాసు రాష్ట్రం విడిచిపోవాలండీ! అయితే పరమేశ్వరమూర్తి గారు! మీరు కలకత్తాలో ఎన్నాళ్లు అవనీంద్రుని దగ్గిర చిత్ర లేఖన నేర్చుకున్నారు?

పరమేశ్వర: బి. ఏ. కలకత్తాలో చదవడానికి వెళ్లాను. పాలీ, సంస్కృతం పుచ్చుకొని ఆర్కియాలజీ శాఖలో చేరుదామని ఉద్దేశం. అప్పటికి నాకు ఇష్టమైనది రామారావు గారి సంప్రదాయమే. నేను ఇంటరు తరగతిలో చదివిన రెండేళ్లు ఆయన దగ్గర చిత్ర లేఖనం నేర్చుకున్నాను. నా