పుట:Narayana Rao Novel.djvu/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
97
గౌతమి

బొమ్మలు రెండు బొంబాయిలోను, ఒకటి చెన్నపట్టణంలోను అమ్ముడైనాయండి. తర్వాత కలకత్తా వెళ్ళి, బి. ఏ. చదువుతూ, అవనీంద్రబాబు పాదాలకడ చిత్రలేఖనానికి దీక్ష వహించాను.

లక్ష్మీ: అప్పుడు వేసిన కొన్ని చిత్రలేఖనాలకు ఇంగ్లండు, వెంబ్లీలో కూడా ప్రఖ్యాతి వచ్చిందండి మా పరమేశ్వరునికి. ఆస్ట్రేలియాకు వెళ్ళినది ఒక బొమ్మ. ఆ రోజుల్లో పరమేశ్వరుని బొమ్మలెన్నో కలకత్తా ప్రదర్శనములో అమ్ముడయ్యాయి.

జమీం: మీ రిప్పుడు వేసిన బొమ్మ లేవేనాఉంటే నాకో బొమ్మ ఖరీదు వేసి పంపించండి. ఖరీదుకు వెరవకుండా మంచి పెద్దరకమే పంపండి. మరీ చిన్న రకము పంపకండి. నా గ్రంథాలయం గదిలో కొన్ని బొమ్మలుకొని పెట్టవలెనని వున్నది. నారాయణరావూ, మీరూ ఆలోచించి పంపించండి.

రాజే: నారాయణ రావు పరమేశ్వరుని బొమ్మలు నాలుగు కొన్నాడు. అతనికడ గొప్ప చిత్రాలు ఉత్తమ చిత్రకారులవి యిరవై ఉన్నాయండి.

ఇంతలో కూడవచ్చిన గుమాస్తా ‘బాబు గారు! ఏడుగంటలయింది, పడవ తిప్పమని సెలవా?’ అని వినయముగా జమీందారు గారి నడిగెను. రాజేశ్వర రావు ‘ఓహో యీగాలి! గోదావరి సముద్రంలో ఉన్నదే కెరటాలతో, అని పాదములు నీటిలోనికి వ్రేలవైచేను.

౨౨

గౌతమి

“శీతే సుఖోష్ణ సర్వాంగీ, గ్రీష్మేతు సుఖశీతలా, భర్తృయుక్తాచయా నారీసా భవేద్వదవర్ణినీ.” నిజముగ నీ గౌతమీ స్రవంతి వరవర్షినియె. గౌతమి మాతవలె, సోదరివలె, ప్రియభామినివలె తనకు జల్లనై, స్నిగ్ధమై, అనురక్తయై తోచుచుండు టేలనో! ఆ నిర్మలవినీలనీరములలో నురికి, దేహమెల్ల నామె గౌగిలింప దన హృదయమూలములకు నామె ప్రేమ చొచ్చుకొనిపోవ, నీటి లోని మత్స్యమై యా నీలజలములోనికణమై యైక్యమైపోయి తేలియాడుచు, మునుగుచు, బాహువులు సారించి యీదుచు, నీ గౌతమి బాలికతో నాతడాడుకొన్నాడు. ఆమె కెరటాలతో పందెము వేచినాడు. లోతులలో మునిగి కన్నులు తెరచి, సూర్యకిరణములు చొచ్చుటచే గరుడపచ్చలయిన యాగాంభీర్యమున విస్తుపోయినాడు. ఆమె హృదయమున దన సర్వాంగ చైతన్యము నుపసంహరించి తరుశాఖవలె తేలినాడు. ఉబికిపోవు నామె వక్షములతో ఎన్ని సారులో చంటిపిల్లవానివలె నాడుకొన్నాడు. గౌతమిదేవిలోని యనిర్వచనీయమగు నానందము తన యంత రాయముల జొరబాఱ నామెలో లీనమైనాడు.