పుట:Narayana Rao Novel.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నౌకావిహారము

95

ఇంతలో జమిందారుగా రా ప్రదేశమునకు వచ్చి నారు. ఆయన స్నేహితులందరిని తన చిన్న లాంచిలో గౌతమీ విహారమునకు దీసికొని వెళ్లినారు. ఆంధ్రులకు బ్రత్యేకరాష్ట్ర మావశ్యకమా కాదా యను చర్చ వచ్చినది. రాజేశ్వరరావు, లక్ష్మీపతియు నాంధ్రదేశమునకు బ్రత్యేకరాష్ట్ర మావశ్యకమని వాక్రుచ్చి నారు. రాజారావామోదించినాడు.

నారా: దేశమునకంతా స్వరాజ్యం తెచ్చే ప్రయత్నాలుమాని, ఆంధ్రరాష్ట్రంమాత్రం తెచ్చే ప్రయత్నం నేను ఆమోదించను. ఎందుకంటారా, యావద్దేశ బంధమోక్షానికి పొటుపడవలసిన ఉత్కృష్టవ్యక్తులకు ఆంధ్రసమస్య సైంధవుడులాగ అడ్డు అవుతుంది. దేశపరిపాలన చేతికివచ్చినతరువాత మీ చిత్తము వచ్చినట్లు భాషనుబట్టో మరొక దాన్ని బట్టో రాష్ట్రవిభజన చేయడం సులభం. అనవసరపు ఖర్చులతో నెత్తి బరువెక్కిన యీ రోజులలో రాష్ట్ర విభజన చేస్తే ఖర్చుకు డబ్బుండక భాగింపబడ్డ రాష్ట్రాలన్నీ దివాళా రాష్ట్రాలయితే ఏమిలాభం?

జమిందారు గారు: స్వరాజ్యము అంటే నీ ఉద్దేశం సంపూర్ణ స్వాతంత్య్రమనేనా?

నారా: ఏదైనా సరేనండి. సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినాసరే, లేదా, ఆస్ట్రేలియా కెనడాలవలె డొమినియను ప్రభుత్వం వచ్చినాసరే. ఏదివచ్చినా ఆదాయవ్యయాలు సంపూర్ణంగా మన చేతుల్లోకివస్తే రాష్ట్ర జనలు మనకు సులువుగా అవుతవని ఉద్దేశం.

జమీ: కాని ఈ లోపుగా మనవాళ్లకి జరిగే అపరిమితమైన నష్టం సంగతి ఆలోచించు. అరవవాళ్ళవే గొప్ప ఉద్యోగాలన్నీ. అరవ దేశంకోసం డబ్బు ఖర్చయినంత తెలుగు దేశ లాభానికి ఖర్చగుట లేదు.

నారా: కాని రామారాయణం గారు మొదలగు తెలుగువారే మంత్రిత్వాలు నడుపుతున్నారు. నెమ్మది నెమ్మదిగా పెద్ద ఉద్యోగాలలోకూడా మన వాళ్ళు చేరుతున్నారు. ఒక పదిసంవత్సరాల పాటు మనం తొందరపడ కుండా స్వతంత్ర సంపాదన దీక్ష వహిస్తే, స్వతంత్రంతో అన్ని చిక్కులు మంచువిడిపోయినట్లు విడిపోతాయని నా ఉద్దేశం అండి.

జమీం: నే ననేది మన దేశానికి ప్రస్తుతం సంపూర్ణ స్వాతంత్య్రము రాదని; వచ్చినా మనకు చాలా నష్టం. సంపూర్ణ స్వాతంత్య్రము రాకుండా డొమినియను ప్రభుత్వం వచ్చేటట్లయితే మనం రాష్ట్ర విభజనకోసంచేసే ప్రయత్నాలన్నీ డొమినియను ప్రభుత్వం వచ్చేందుకు ప్రయత్నాలవుతవి. పైగా కాంగ్రెసు తరఫున గాంధీగారి ననుసరించి పని చేసేవాళ్లు ఏ కారణం వల్లను ఇతర వెఱ్ఱులలో పడరు. వాళ్లమార్గం రాజమార్గమే. ఇక నాబోటి వాళ్లా, మాకు గోఖ్లేగారి మార్గమే. మీ పద్ధతులు మాకు నచ్చవు. నచ్చక ఇక ఏమి చేయము? ఈ పనులు మేము చేస్తాము.