పుట:Narayana Rao Novel.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

నారాయణరావు

సుబ్బయ్యశాస్త్రి యింటి కాతడెన్ని సారులు వెళ్ళెనో! కాని యాతనికంటి కామె తళుక్కుమన లేదు. పుష్పశీలకు గావలియుండు బ్రహ్మరాక్షసి యిప్పుడు సుబ్బయ్య శాస్త్రి వేలువిడిచిన మేనత్త. ఒకనాడు సుబ్బయ్య శాస్త్రి మేనత్తకు జ్వరము వచ్చినది. ఆ యాదివారము నాటి సాయంసమయమున రాజేశ్వరుడు మిత్రునింటికి టీ వేళ కరుదెంచి తేనీరు గ్రోలుచుండ సుబ్బయ్య శాస్త్రి మేనత్తజ్వరముచే దనకు బెంగగా నున్నదని చెప్పినాడు. రాజేశ్వరు డదివిని తనదగ్గర నద్భుతమగు జ్వరనారాయణాస్త్రమువంటి పాశ్చాత్యౌషధ మొండు కలదనియు, నది రెండుమూడు మోతాదులతో గుదుర్చుననియు జెప్పి, తానెక్కి వచ్చిన సైకిలుమీద నతివేగమున నింటికరిగి యా మందు పట్టుకొనివచ్చి యిచ్చెను.

సుబ్బయ్య శాస్త్రి, చీకటిపడువరకు రాజేశ్వరు నచ్చటనే యుంచి మాట్లాడుచుండగ, లోననుండి పనిచేయుమనిషి వేగముగావచ్చి చెల్లమ్మ గారికి చెమటలు జడివానలా పోస్తున్నాయండి’ యని చెప్పెను.

స్నేహితు లిరువురు గుభాలున లేచి లోనికి బోయినారు. వారిరువు రచ్చటకు బోవునప్పటికి పుష్పశీలమ్మ యొక తెల్లని వస్త్రముచే నా రోగి ముఖము తుడుచుచుండెను. ఆమె తలయెత్తి రాజేశ్వరరావును జూచెను. రాజేశ్వరు డామెను జూచెను. చెల్లమ్మ గారికి జ్వరమును తగ్గెను.

అది మొదలుకొని పుష్పశీలాదేవి తప్ప ప్రపంచమున నేవస్తువు గోచరించుట లేదు. మనమున నింకొక భావము ప్రసరించుట లేదు. ఆతని జీవితసూత్ర మా బాలికారూపసంపదను బెనవేసుకొని పోయినది. భోజనము రుచించుట లేదు. నిద్రపట్టుట లేదు. గ్రంథములపై మనసుపోదు. టెన్నిసు మొదలగు నాటలాడ నిచ్ఛలేదు. స్నేహితుల సమావేశములు వెగటైపోయినవి.

రాజేశ్వరుని జూచినప్పటినుండియు, పిపాసార్థితునకు జల్లని మంచినీళ్లు కనులబడినట్లయినది పుష్పశీలకు. ఠీవియైన నడకతో, ఫ్రెంచిమీసముతో, పురుషత్వము వెలిగిపోవు రూపసంపదతో, రాజేశ్వరు డామెకు జయంతునివలె బొడగట్టినాడు. దూరదూరాననే నాగరికతాసముజ్వలులగు యువకులజూచి సంతసించు నాయోషారత్నమునకు రాజేశ్వరుడు అతిలోక సుందరుడై, ముంగిటి పెన్నిధానమై తోచెను.

ప్రోడయగు పుష్పశీల నాటినుండి రాజేశ్వరు డనేక మిషలతో దన యింటికి వచ్చినప్పుడు భర్తకు దెలియ రాకుండ దర్శన మొసగుచుండును. నర్మగర్భములగు చూపులతోడనే వారిరువురు నించుకించుక హృదయతాపోపశమన మొనర్చుకొనుచుండిరి.

భర్త కోర్టులో నొక గట్టి వ్యాజ్యములో మునిగియున్న రోజున రాజేశ్వరుని కేరీతినో చీటివచ్చినది. ముసలమ్మకు జ్వరము మరల వచ్చునట్లున్న దనియు దామిదివరకు ఇప్పించినమందు పట్టుకొని రావలసినది అనియు నా చీటి