పుట:Narayana Rao Novel.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమస్వాతంత్య్రము

87

తోలువాడొక పెద్దకాలపు వీరాస్వామి. వీరాస్వామికి దన మోటారుబండి తప్ప నితరమేమియు గనపడదు. పుష్పశీల ప్రపంచము చూడవలెనను గాఢవాంఛగలది. తనయందము, తన నగలు, తన చదువు నితరులముందు, ముఖ్యముగా బురుషులముందు, మెఱపించుట కామె ముచ్చటపడుచుండును. కాబట్టి యత్తగారు గృహకృత్యము లొనరించుకొను నప్పుడు, మధ్యాహ్న భోజనానంతరము కునుకుదీయునప్పుడు, మేడమీదనుండి సమస్తాభరణభూషితురాలై యాకాశమునుండి తొంగిచూచు తిలోత్తమవలె ఇన్నీసుపేట వీధిలోనికి జూచుచు, ఆ దారి నేను పడుచువాండ్రకు ఎదురువచ్చు బండ్లరాకయు కాలము పోకయు దెలియనిచ్చెడిదికాదు.

ఎంతకాలమునుండియో ముదుకమేనితో బ్రాణములకు లకెవైచికొనియున్న సుబ్బయ్యశాస్త్రి తల్లి పుష్పశీల పుణ్యము పండియో, ఆపె ఘోష కొట్టియో యుండియుండి యొక్కనాడు ‘కృష్ణ కృష్ణా!’ యనుచు, నెవరికి దెలియకుండ, నే ముదుకలోకమునకో యెగిరిపోయినది. సుబ్బయ్యశాస్త్రి తన కుడిభుజము కూలిపోయినట్లు తన భార్యకు సాయముండువా రెవ్వరూ లేకుండిరని వాపోయెను. గూటిలో చిలుక కొదమవలెనున్న పుష్పశీల కొక్కసారి రెక్కలు విప్పుకొన్నట్లయినది. సుబ్బయ్యశాస్త్రికి గడియవైచిన తన యింటి తలుపులన్నియు విప్పుకొన్నట్లయినది. గంపంత యింటిని జూచుకొని, వయసులో నొంటరిగా నున్న తన భార్యను జూచుకొని, తన కోర్టుపని దలచుకొని సుబ్బయ్య శాస్త్రి, నిలువునా నీరైపోయినాడు.

పుష్పశీలకు భర్తపై గాఢనురక్తి లేకున్నను అసహ్యముమాత్రము లేదు. భర్తతో నీ యేడేండ్ల కాపురము లోకముతో పాటుగానే వెళ్లబుచ్చినది. నేడామెకు నెత్తిమీద బరువు దింపినట్లయినది. హృదయమునుండి కత్తిమొన పెరికివేసినట్లయినది. కళ్ల గంతలు విప్పినట్లయినది.

సుబ్బయ్య శాస్త్రికి భార్యయన్న వెఱ్ఱిమమకారము. ఇతర స్త్రీలపై నుబలాటము. ఇతర వనితల కెప్పుడు నాతడు మాటయిచ్చి తప్పినది లేదు. పుష్పశీల మాట కడుగుదాటినదియు లేదు. భార్య యాతనికి తుష్టి గూర్చు షడ్రసోపేత భోజనము. పరకాంత లాతనిచపలజిహ్వకు ఫలహారములు.

పుష్పశీల గర్భమింతవరకు ఫలించలేదు. ఆమె బ్రతుకున నిండియున్న కామపరిమళము పూర్ణముగా నింక నెవ్వరిని జుట్టుకొనలేదు. ఆమెతో యౌవన మాధుర్యము నరమూతకనులతో గ్రోలి చరితార్థ మొనరించు మధువ్రతుని కొఱకామె తపియించుచున్నది. తన మంజులాంగ సౌకుమార్యసరసతావిలాసముల నెమ్మేన పెనవేసుకొని మునుకలిడి, తెప్పదేల్చు పురుషవర్యు డామెకు బ్రత్యక్షము కాలేదు.

చెన్నపట్టణమునుండి వచ్చినప్పటినుండియు రాజేశ్వరునకు బుష్పశీలను జూడవలెనను వాంఛ వేయిమడుంగులైనది. అది యాతనికి దపస్సయినది.