పుట:Narayana Rao Novel.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతి

89

చెప్పినది. రాజేశ్వరుడు రెక్కలు గట్టుకొని యచ్చట వాలినాడు. కాని యతని తోడనే వచ్చినట్లు సుబ్బయ్యశాస్త్రియు నూడిపడినాడు. రాజేశ్వరుడు హృదయములో శాస్త్రిని నూరుహత్య లొనరించినాడు.

౨౦

వేదాంతి

రాజారావు త్వరలోనే చెన్నపట్టణము వెళ్లి కాలేజిలో జేరదలచినాడు. విక్టోరియా హాస్టలులో నుండుట కతని కాయేడు వీలులేదు. విశ్వవిద్యాలయము వారు నెలకొల్పిన వసతిగృహములో నాతడు విధిగా జేరవలసిన చ్చెను. ఆ యేటితో నాతని చదువుగూడ బూర్తియగును.

రాజారావు వైదిక సాంప్రదాయము సంపూర్ణముగ నెఱపు వెలనాటి బ్రాహ్మణుడు. చిన్నతనములో నాతనితండ్రి వసుదేవశాస్త్రి గారు సంధ్యావందనము, పురుషసూక్తము, శ్రీసూక్తము, నమకము, చమకము నాతనికి నేర్పినాడు. వేదములో కొన్ని సూక్తములు పఠింపించినాడు. కాని రాజారావున కా చదువు నచ్చమి దండ్రిగారితో జెప్పకయే మోడేకుఱ్ఱునుండి పారిపోయి కాకినాడ జేరుకొని, కొందరు సంపన్న గృహస్థులయింట వారములు కుదుర్చుకొని, దయాహృదయుడు, విజ్ఞానసముద్రుడు, భగవద్భక్తుడు, బ్రాహ్మమతాలంకారుడు, కళాశాలాధ్యక్షుడునగు శ్రీ వెంకటరత్నంనాయుడు గారి దయకు బాత్రుడై విద్యార్థి వేతనమును సముపార్జించుకొన్నాడు.

తనయు డెచ్చటికి బోయినదియు దెలియక యాతని తల్లిదండ్రులు బెంగగొనిపోయిరి. అతని తల్లి పేరమ్మగారికి మతిబోయి మూర్ఛజనించినది. పిమ్మట నెలదినములకు మూడవ ఫారములో తాను జేరినాననియు, బాగుగా జదువుకొనుచున్నాననియు, రాజారావు ఉత్తరము వ్రాసెను. దానితో తల్లిదండ్రు లిరువురు కాకినాడపోయి కుమారునిజూచి, కనుల నీరునింపుకొని, కుర్రవానిని వదిలి యుండలేక తాము సకుటుంబముగా వచ్చి కాకినాడలోనే వసింప నిశ్చయించుకొనిరి.

రాజారావంత అద్భుతమైన తెలివితేటలుగలవాడు కాడు. ఎట్టులో కష్టించి పరీక్షలలో గృతార్థుడగుటకు వలయు తెలివితేట లాతనికడ నున్నవి. కాబట్టి ఏపరీక్షయు దప్పకుండ నెగ్గుచుండెను. తుద కింటరుపరీక్షలో రెండవ తరగతిలో గృతార్థుడై మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము సముపార్జించెను. కాకినాడలో నాతని తండ్రి తన తెలివి తేటలచే కుటుంబవ్యయమునకు సరిపడ సంపాదించుకొనుచు, భూమివలన వచ్చు రాబడిని నిలువ వేసుకొనుచు, చిన్న చిన్న పద్దులమీద వడ్డీవ్యాపారము సలుపుకొనుచు కాలము బుచ్చినాడు. నేడు తన కొమరునకు మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము దొరకుట యాయనకు జాల సంతోషముగా నుండెను.