పుట:Narayana Rao Novel.djvu/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


 ప్రాణయగు సూర్యకాంతము నును లేతయెదకు వారిరువురి భావములు స్పష్టమై తోచినవి. అన్నా వదినెల మనోమాలిన్యము తుడిచివేయుటకో యన నా బాల ‘గుమ్మడిపం డావును చూతము రం’డని తన చిన్నారిచేతులు సాచి వారిరువురి హస్తములు గ్రహించి బిరబిర గొనిపోయినది.

౧౬

గృహమేధి

సుబ్బారాయుడు గారింటి వెనుక పెరటిలో నొక తూర్పువెలమల కుటుంబము, రెండు బీదకాపుల కుటుంబములు, అయిదు తూర్పుగొల్లల కుటుంబములు కాపురమున్నవి. వారందరు సుబ్బారాయుడుగారి పాలేరులే. కాపులలో కుంకట్ల సోమయ్య యనునతడు పెద్దపాలేరు. సుబ్బారాయుడు గారు పాలేండ్ర కాపురమునకై శుభ్రమగు నిండ్లు కట్టించి యిచ్చిరి. సోమయ్య యిల్లు తక్కిన వానికన్న బెద్దది. సోమయ్య బహుకుటుంబీకుడు. వృద్ధుడయ్యు జబ్బసత్తువయు చక్కని కంటిచూపును గల్గి వ్యవసాయము చేయించుటలో పేరుగన్న కాపు. సోమయ్య తండ్రి నాటనుండియు సుబ్బారాయుడు గారి తండ్రికడ వారు పాలేరులుగా బ్రవేశించినారు. సంసారము బొత్తుగా జితికిపోయి, కడు పేదరికమున సోమయ్యతండ్రి వీరయ్య సుబ్బారాయుడుగారి తండ్రి శ్రీరామమూర్తి గారి నాశ్రయించి పాలేరుగా జేరి, తన తెలివి తేటలచే, విశ్వాసముచే గ్రమముగా బెద్దపాలేరైనాడు. అప్పటికే సిగ యెగగట్ట నేర్చిన సోమయ్య, తండ్రికి కుడి భుజమై ఆతనికి దగిన కుమారు డనిపించుకొనుచు శ్రీరామమూర్తి గారికడ జీతము గొనుచుండెను.

ప్రథమమున సంవత్సరమునకు బదునెనిమిది బస్తాల ధాన్యమునకు బ్రవేశించిన వీరయ్య పోనుపోను ఇరువదియైదు బస్తాలు, నేబది రూపాయల రొక్కముగూడ జీతముగా బుచ్చుకొని, తొంబదియేళ్ళ వృద్ధుడై చనిపోయినాడు. సోమయ్య నేడు పెద్దపాలేరు. సుబ్బారాయుడుగా రాతనికి పాలేరని పేరు మార్చివేసి గుమాస్తాయని పేరుపెట్టి నెలకు బదునేను రూప్యముల జీతము, బస్తాగింజలు చొప్పన నిచ్చుచుండెను.

తక్కిన పాలేళ్ళందరకు కూడ మంచిజీతములే యిచ్చుచు, సుబ్బారాయుడు గారు వాండ్రకు శౌచాదిక ము నలవరచిరి. దొడ్డిలో నున్నవారు గాక మాలలు, గౌడులు నలుగు రితరపాలేళ్ళుండిరి. ఇంటిలో అంట్లుతోముటకు, నీరు తోడుటకు, బిడకలు చేయుటకు దొడ్డిలో గాపురమున్న కుటుంబములలోని స్త్రీలనే నియమించిరి. వారికిని సంబళము నేర్పరచిరి. సోమన్న కోడలు ఇంటిలో నాడు వారికి వలయుపనులన్నియు చేయుట, బియ్యము బాగు చేయుట, పిండిని విసరుట, బట్టలు సర్దుట, ఎక్కడివస్తువు లక్కడ నుండునట్లు చూచుట మొదలగు పనులను జేయుచుండును.