పుట:Narayana Rao Novel.djvu/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
69
గృ హ ప్ర వే శ ము

ఆమె భర్తకు బదులుపలుకక మోమువంచికొన్నది. నారాయణరావు చిన్నబుచ్చుకొనియు, బాలిక సిగ్గుపడియుండబోలు నని సమాధానపడినాడు.

‘’శారదా! నీ కింగ్లీషు బాగా వచ్చునట కాదూ? ఇంగ్లీషు చదువుకొన్న బాలికలు సిగ్గుపడరటగా! నువ్వీయేడు స్కూలు ఫైనలు పరీక్షకు వెళ్ళుతావను కొన్నారే. అట్లాంటప్పుడు నాతో మాట్లాడడాని కీ సంకోచం ఏమిటి?’ నారాయణరా వింగ్లీషులోనే యామె నడిగినాడు.

శారద మారుపలుక లేదు. ఆమె నలముకొన్న ఆశ్చర్యపుదెర ఇంకను అలమినట్లే యున్నది. ఆమె మౌనముద్ర వహించియే యుండెను.

‘ఈ యేడు గవర్నమెంటు పరీక్షలో మొదటి తరగతి మార్కులు వస్తాయని మీ దొరసాని గారన్నది. నువ్వు చదువుకోని బాలికవలె సిగ్గుపడవని ఆమె చెప్పిందే? సిగ్గెందుకు నీకు? ఆమెమాటే నిజం అయితే, ఏదీ మాట్లాడు చూద్దాం.’ (ఇంకను ఇంగ్లీషు భాషలో నే...)

శారదకు బౌరుషము వచ్చినది. మద్రాసు యూనివర్సిటీ వారి మెట్రిక్యులేషను పరీక్షకు దరఖాస్తు పెట్తున్నాను. స్కూలు ఫైనలు పరీక్షకు పాఠశాలలో జేరాలికదా!’ అనిన దింగ్లీషులోనే.

‘అదీ! అల్లాగు జవాబు చెప్పాలి. ఫిడేలంటే యిష్టమా, లేక వీణంటేనా?’

‘రెండూనూ.’

‘ఆ రెండింటిలోను ఏది మంచిది?’

‘దేని కదే!’

‘అల్లాంటే ఎల్లాగుమరి? వీణమీది తానం ఫిడేలుమీద రాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధ్వని ఫిడేలులో లేదు. ఫిడేలు...’

‘అందుకనే దేని అందం దానిది. దాని అందం దీనికి, దీని అందం దానికి రాదు.’

‘నీవు సంగమయ్య గారి కచేరీ చూశావా?’

‘మా మేడకివచ్చి ప్రతియేడూ పదిహేనురోజులు మకాం చేస్తూవుంటారు. ఆయన అద్భుత వాద్యము నాకు వినిపించి నావీణపాటకు మెరుగులుదిద్దేవారు.’

‘ఏమిటీ! సంగమయ్య గారికే శిష్యురాలివా! ఎంత అదృష్టవంతురాలివి!’

ఇంతలో నూరేగింపు విడిదికడకు వచ్చుటచే నా నూతనవధూవరుల సంభాషణ యాగిపోయినది. నారాయణరా వట్టులనే మూడు నాలుగు సారులు భార్యతో మాటాడి ఆనందధామములో విహరించినాడు.

ఈనాడు తోటలో, భర్త సూర్యకాంతము నట్లు బలుకరించినప్పుడు, శారద కించుక రోత పుట్టినది. కనురెప్పమూత కాలములో జనించి మాయమయిన యా భావమును గ్రహించిన నారాయణరావు మనస్సు చివుక్కుమన్నది. సోదర