పుట:Narayana Rao Novel.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

నా రా య ణ రా వు

రాయుడు గారు లెక్క తెలియనిఖర్చు చేయుచున్నను శ్రీరామమూర్తి అడ్డుపెట్ట లేదు సరికదా, తండ్రి మరచిపోయినచో దానే జ్ఞప్తి చేసి ఖర్చు పెట్టించెడివాడు.

సుబ్బారాయుడు గారు తాను వరశుల్కము గ్రహింపనని తొలుతనే స్పష్ట మొనర్చుటచే, జమిందా రల్లునికి నలువది యకరముల ఈనాముభూమి, తన జమిందారీలోనిదిగాక, తన కున్న రైతువారీ భూములలోని సుక్షేత్రము, తణుకు తాలూకాలో తన గ్రామమునకు దగ్గర నున్న గ్రామములోనిది అరణ మొసంగి నాడు. తన కుమార్తెకు నిరువది యకరముల భూమి వ్రాసియిచ్చినాడు. మఱియు నిచ్చిన వస్తువాహనములకు లెక్కయే లేదు. ఆమె పేరున బ్యాంకిలో ఏబదివేలు రొక్కము నుంచినాడు.

సుబ్బారాయుడుగారుగూడ పెద్దకోడలి కిచ్చినట్లు పదివేలరూప్యములు చిన్నకోడలి కాభరణముల నిమిత్త మిచ్చినారు.


౧౫ ( 15 )

గృహప్రవేశము


గృహప్రవేశమునకు బెండ్లికొమార్తెతో శకుంతలాదేవియు, జమిందారు గారి వేలువిడిచిన మేనకోడలు లలితయూ, వరదకామేశ్వరీ దేవి పుట్టినింటి చుట్టము సరోజినియు, జమీందారు గారి కుమారుడు కేశవచంద్రుడును వెళ్లినారు. సుబ్బారాయుడు గారు తన చుట్టములందరిని పదునాఱు రోజుల పండుగ వఱకు నుండుడని కోరినారు. సుబ్బారాయుడు గారు బంధుసముద్రుడు. మర్యాదలు సలుపుటలో జనకమహారాజు. ఆయన బందుగులు, జానకమ్మ గారి బందుగులు, బిడ్డల చుట్టములు గలపి మూడువందలమంది వివాహమునకై చేరినారు. వారిలో బెక్కురు రాజమహేంద్రవరము నుండియే వెళ్ళిపోయినారు. కొన్ని కుటుంబముల వారు కొత్తపేట వెళ్ళినారు. కొత్తపేటలో ఎనమండుగురు తెలుగు వంటబ్రాహ్మణులను ఇరువురు దాక్షిణాత్య బ్రాహ్మణుల నియమించి సుబ్బారాయుడు గారు వధూవరుల గృహప్రవేశ మహోత్సవము పెండ్లివలె జరిపినారు. ఒక నాడు కోనసీమలోని పెద్దలందఱు విందుకు ఆహ్వానింపబడిరి. వధువుతో నరుదెంచిన బంధువులకు రాజభోగము లర్పింపబడినవి.

వివాహమున నన్నియు ఖద్దరు వస్త్రములే యుపయోగించినారు మగ పెండ్లివారు. తప్పని సరియైనప్పుడు స్వదేశీవస్త్రములు, పట్టువస్త్రములు నిచ్చినారు. ఆడపెండ్లి వారు పెండ్లికుమారునికి, ఇతర మగవారికి ఖద్దరు వస్త్రముల నిచ్చినారు. ఆడువారికి వారికి దోచినట్లు పట్టుచీరలు, రవికలు, విదేశీ చీరలు మొదలగునవి యొసంగినారు.

శారద కత్త వారి యిల్లు విచిత్రముగానే యున్నది. తన తండ్రి గారి మేడలో నున్న సోఫాలు, మరదిండ్లకుర్చీలు లేవు. ఒకటి రెండు తివాసీలు చిన్నవి యచ్చట నున్నవేమో! తన మేడలో అన్నియు తివాసీలే. గోడల