పుట:Narayana Rao Novel.djvu/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
44
నా రా య ణ రా వు

నారా: కాదోయి! స్థానబలము మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. స్థానబలిమివంటిదే స్థానవైపరీత్యమున్నూ.

లక్ష్మీ: సరి, నువ్వు ఒక్కడవు మదరాసులో ఉంటున్నావు కదా, మదరాసులో కుఱ్ఱవాళ్ళు పాడవ్వాలంటే ఎన్ని మార్గాలు లేవు? మన వారెవ్వరూ అక్కడ లేరు. అయినా ఎందుకు నువ్వు తగలబడి పోలేదురా మఱి?

నారా: నీ వాదన నాకు అర్ధమైందోయి. ఒకటిచూడు. భరత దేశంలో ప్రతి వ్యాపారంలో ముఖ్యజీవితాదర్శమైన సత్యమును సాధ్యమైనంత వరకు మరచిపోకుండా గమనించేటట్టుగా మన్ని మన పూర్వ నాగరికత తయారు చేసింది. ఆ నాగరికతయే ఈ నాటికిన్ని ఏదో రకంగా ఏదో రూపంగా సర్వత్రా వ్యాపించి ఉంది. అట్టి సంప్రదాయబలమే మన్ని ఇక్కడ కాపాడుతోంది.

లక్ష్మీ: సరే అదీ ఒప్పకుంటాను. అయితే, నువ్వు పాశ్చాత్య దేశం వెళ్లే వాళ్ళసంగతి జాగ్రత్తగా ఆలోచించు. వాళ్ళలో మూడురకాల మనుష్యులు. డబ్బుండి, పాశ్చాత్య నాగరికత అనుభవిద్దామని, చదువుపనిమీదో ఆరోగ్యం వంక మీదో లేకపోతే స్వతంత్ర ప్రభువులైన మహారాజులలాగ సరదాగానో వెళ్ళేవాళ్ళు మొదటిరకం.

నారా: అవును బావా ! అటువంటి వాళ్ళు వెళ్ళి చేసేపని ఏముంది? మన దేశంలో ధనం తీసుకుని వెళ్ళి అక్కడ తగల బెట్టడమే! మన దేశం బీద దేశం, పాశ్చాత్య దేశాలు భాగ్యవంతములైనవి. అందులో ఇంగ్లండు, ఫ్రాన్సు, అమెరికాలు మఱీని. వారికి విషయ సౌఖ్యమే ఆదర్శం. అందుకోసం ఎన్ని చిత్రాలో సృజించుకొన్నారు. వాట్లకోసం పది ఖర్చు చేసేచోట వేయి ఖర్చు. కాని పాశ్చాత్యులు మన దేశం వస్తే మన దేశంలో అన్నీ వెఱ్ఱి చవుక. వారికి మన దేశంలో ఖర్చు పంటికింద పోక చెక్క.

లక్ష్మీ: ఇంక రెండోరకం. ఉద్యోగం కోరి వీలయిన చదువు కొఱకు వెళ్ళే వాళ్ళు. ఇంగ్లాండులో చదువులన్నీ అట్లాంటివే. మూడోరకం వాళ్ళు పూర్ణమైన జ్ఞాన సముపార్జనమాత్రం కారణంగా పెట్టుకొని వెళ్తారు.

నారా: అలాంటి వాళ్ళు ఆ వ్యామోహంలోపడి పాడయిపోయి జ్ఞానసముపార్జనోద్దేశం మఱిచిపోవ రటోయి మఱి? ఆ హాని ఎదురుగా అమ్మ వారిలా నోరు తెరచుకొని లేదూ?

లక్ష్మీ: అల్లా పాడయ్యే వాడికి నిజమయిన విద్యావ్యసనం లేదన్నమాట!

నారా: నువ్వు చెప్పిన కారణాలు గ్రహించక అనటము కాదు. నిజమే! శాస్త్ర జ్ఞానం పూర్ణముగా సంగ్రహించుటే వ్రతంగా పెట్టుకొని వెళ్ళినవాడు ఉత్కృష్టజీవే! మన రామచంద్రుడు ఆ విధమైన తన్మయతలోనే ప్రయాణం సాగించాడు. పాశ్చాత్య దేశాలు వెళ్ళవలసివస్తే చిన్నతనంలో వెళ్ళడమే మంచిదని ఎరుగుదును. కామశక్తి మాంచి యౌవనంలోనే మనుష్యజీవితాన్ని