పుట:Narayana Rao Novel.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దే శాం త ర్గ తు డు

43

మట్టిపాలయినవి. అప్పటి నుండియు, మంచి గడుసరియైన భీమరాజుగారు వర్తకం, ఎగుమతి దిగుమతులు మానివేసి, చేతికందినంతమట్టుకు ధనము సేకరించుకొని ఇంపీరియల్ బ్యాంకులో రెండులక్షల యిరువది వేలు నిలువ చేసి, ఆ వల్ల వచ్చిన ధనముతో సుఖముగా గాలక్షేపము చేయుచున్నారు. ఆయనకు భూములన్న నమ్మకము లేదు. స్వసౌఖ్యము కొఱకు, కంపెనీ దొరలకు ‘సప్లయి’ కొఱకు, మామిడి మున్నగు ఫలవృక్షములు గల తోట నొకటి పిఠాపురం దగ్గర సంపాదించినారు.

అట్టి భీమరాజు గారి యేక పుత్రునకు నాల్గువేలరూపాయల కట్నము, రెండువేల రూపాయల లాంఛనములతో నారాయణరావు నాల్గవ చెల్లెలి నిచ్చి వివాహ మొనర్చినారు. సుబ్బారాయుడుగారన్న భీమరాజు గారికి గౌరవము, భీమరాజు గారన్న సుబ్బారాయుడు గారికి గౌరవము.

నారాయణ రావు, లక్ష్మీపతి, భీమరాజుగార లాలోచించి రంగూనులో భీమరాజు గారి స్నేహితున కొకనికి తంతివార్త నిచ్చిరి.

తన కుమారుడు పాశ్చాత్య దేశములకు వెళ్ళి ప్రఖ్యాతిగడించుట భీమరాజు గారికి సంతోషమే, కాని తనకు కావలసినంత యున్నది. వట్టి పేరు ప్రతిష్ఠలవలన కలుగు లాభమేమి? ఒకడే కుమారుడు, కాని దేశాల నుండుట, అక్కడ బాలుని కనిపెట్టి చూచు దిక్కెవ్వరు లేకపోవుట, కొంచెము జబ్బు చేసిన తలిదండ్రు లరచేత ప్రాణములుంచుకొను వారే. ఆ దూరదేశములు కుఱ్ఱవానికి పడునా? ఎట్టి చదువో? వాడు ఎన్ని ఇబ్బందులుపడునో? చలిఎక్కువ. తిండి వేఱు. అన్నిటికన్న పాశ్చాత్యదేశ వనితలు పాల్పడని వైపరీత్య మేది కలదు? భీమరాజుగా రీ భయములు తన బావమరదుల జెవిలో కంఠాన గద్గదిక తో నేకరువు పెట్టినారు.

నారాయణరావునకు గుండె గుభిల్లుమన్నది. పాశ్చాత్య దేశముల కేగిన యువకు లెందరో తెల్లని మేనులకు వలచి, దిగ్భ్రమనొంది, హృదయములు ఆ శ్వేతకాంతల పాదములకడ ధారవోసికొనినారు. అట్టి వారికి ఇంటికడ భార్య బానిసవలె రాక్షసివలె కన్పించును. ఎంతమంది భారతీయులు దీపము కడ శలభములవలె నరించి పోయినారుకాదు? రామచంద్రుడు చిన్న వాడు, డబ్బుకలవాడు. సంస్కారహీనలు, పురుషుల వలపింప నేర్చిన మాయలాడులు నగు తుచ్ఛవనితలు వేలకు వేలు పాశ్చాత్య దేశమున గలరని యాతని నమ్మకము. వారి వలలలో భారతీయ యువకులెందరో చిక్కినారు. భగవంతు డెట్టి విపరీతముల నొనరింపనున్నాడో యని లక్ష్మీపతి చెవిలో నూదినాడు.

ఆ రాత్రియంతయు బావమరదు లిరువురు గాఢాలోచనలో నిదుర నెఱుగరు.

లక్ష్మీ: నీకు చాలా భయమురా బావా! మానవప్రకృతి యెల్లప్పుడు కుటిలముగా సంచరిస్తుందనా నీ భావము?