పుట:Narayana Rao Novel.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

నా రా య ణ రా వు


నారా: అత్తయ్య గారూ! ఏమిటి మీరల్లా అధైర్యపడతారు! పట్నవాసంలో ఉన్నారు. ప్రపంచం సంగతి చూస్తున్నారు. సరోజినీదేవి గారివంటి ఉత్తమ స్త్రీల ఉపన్యాసాలకు వెళ్ళి వింటున్నారు. ఆంధ్రమహిళాసంఘంలో మీరు పేరుపొందిన సభ్యురాలుగా ఉన్నారు. ఎంతమంది మనదేశములో యీనాడు పాశ్చాత్య దేశాలకిపోయి అత్యుత్తమ విద్యల నేర్చుకోవడం లేదు! మీరు వీరమాతలు. మీ అంతట మీరే ‘నాయనా పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసివుంటే వెళ్ళిరా’ అనవలసింది.

లక్ష్మీ: పిన్ని గారూ! అక్కడకు వెళ్ళి లోక ప్రఖ్యాతి సముపార్జించటానికి నోచుకొన్నాడు, మా తమ్ముడు!

భీమ: (భార్య దుఃఖంవల్ల ఎక్కడ లేని ధైర్యముగలిగి) సరే, మీటింగు ముందరి మాటలూ ధైర్యమూ, కష్టం కలిగినప్పుడే అక్కఱకు రావాలి. ఎందుకు ఏడ్పు? ధైర్యంతో వెళ్ళాడు. శౌర్యంతో వస్తాడు.

రామచంద్రరావు తల్లి దుర్గమాంబ గారు లేచి ‘నాయనా నారాయణ రావు, బాబూ లక్ష్మీపతీ! ఏం చెయ్యను. ఒక్కడే కొడుకు, ఒక్కటే కాన్పు. ఆడదాన్ని కబుర్లకయినా అక్కరకు రాను. నా శక్తి స్వభావం అంతే! ఏం చెయ్యను? నాతో రెండు నెల్లనుంచి వాదిస్తున్నాడు. నేనన్నాను, చదువు కోసము పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా! గాంధీగారు ‘పాశ్చాత్యవిద్య ఆత్మ వికాసాన్ని చంపుతుంది. రామమోహనరాయివంటి వాడు పాశ్చాత్యవిద్య లేక పోతే ఇంకను వేయి రెట్లు మహాఋషి అవును’ అని చెప్పలేదా? అని నేను వాదించాను. వాడు ‘నువ్వు చెప్పిందంతా నిజం, అమ్మా! కాని మనం శాస్త్ర పరిశోధనలలో నూతన విషయం కనిపెట్టితే, ఇంగ్లీషువిద్యలో పెద్దపట్టా పొందితే గాని, ఆ సంగతి లోకం ఒప్పుకోదు. కాబట్టి నేను జర్మనీకి లేక అమెరికాకో వెడతాను’ అంటూ వుండేవాడు.

భీమ: ముందు కర్తవ్యం ఆలోచించకుండా ఇలా అన్నాను, అలా అన్నాను అని కూర్చుంటే ఏమి లాభం?

అందఱు కలిసి వారి మేడయింటిలో మధ్యహాలులో కూర్చుండినారు.

బుద్ధవరపు భీమరాజు గారు పూర్వకాలమునుండియు కాకినాడలో వర్తకము చేసి ధనికులైన పెద్ద కుటుంబముల వారిలో నొక కుటుంబమునకు పెద్ద. ఆయన వర్తకమునకు, లౌకికమునకు వీలయిన చదువుమాత్రమే చదువుకొన్నారు. కానీ కుబేరునకు వన్నెదిద్దు వ్యాపారపు సరళి, సులువులు, చాకచక్యము, వ్యాపార యుద్ధనీతి సంపూర్ణముగా నెగిన బ్రాహ్మణ శ్రేష్ఠి. పట్టణములోని వారెల్ల వారి కుటుంబమును బ్రాహ్మణ శ్రేష్ఠు లనే పిలుచుచుందురు.

ఆయనకు లేక లేక రామచంద్రరావు విపరీత మేధాసంపదతో జన్మించినాడు. అతనికి వర్తకమన వైముఖ్యము. దానికి తగినట్లు భీమరాజు గారికి వ్యాపారములో నష్టము తర్వాత నష్టము వచ్చి, మూడులక్షలన్నర రూపాయలు