పుట:Narayana Rao Novel.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చి న్న వా డు

45

కదల్చి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కామపరమైన మాయలకు మనుష్యుడు నిముషంలో లోబడిపోతాడు. చిన్నతనంలో కుర్రవాడు వాని దీక్షలోనే ఐక్యమై యుంటాడు. కాబట్టి వాడికి వాడి విద్యతప్ప వేరాలోచన కించిత్తైనా పుట్టనిమాట నిశ్చయం. పైగా పరిపక్వమగుటకు సిద్ధమవుతూన్న అతని హృదయానికి అపరిచితమైన విషయాలన్నీ భయంకల్పించే నీడలు. వాటిని నిరోధించటానికి అతడు చేసే ప్రయత్నం కృత్రిమము లేని సత్యహృదయంతో చేసేదే. అందుకనే చిన్న తనమే చాలా ఉత్తమం. కాని ఎంత చెప్పినా చెల్లాయి బాధపడుతుందని భయం నన్ను కదల్చివేస్తూంది బావా!

లక్ష్మి: ఓయి వెఱ్ఱి వాడా! యీ భయాలు నీబోటి ఉత్కృష్ట మానవునికి తగవురా!


౧౧ ( 11 )

చిన్నవాడు


ఆ రాత్రియంతయు నారాయణరావునకు నిద్రపట్ట లేదు. సూర్యారావు పేటలో భీమరాజు గారి మేడమీద ఆరు బైట వేసిన మంచముమీద వెల్లకిల బరుండి నారాయణరావు అశ్వినీ దేవతలు, బ్రహ్మహృదయము, అనూరాధ, తుల, వృశ్చికము, ధృవుడు మొదలగు తారామండలమునంతయు జొచ్చి చూచు చూపులతో గమనించుచుండెను. నక్షత్రవిరాజితమగు నయ్యాకాశకాండపటములో దన చిన్ననాటి కోర్కెలన్నియు నాతనికి మూర్తములై గోచరించినవి. చిరుత కోర్కెలతో దేశాలు గ్రుమ్మర దానును గోరువాడు. పాశ్చాత్యదేశము లాతని మనోలోచనాలకు దన చుట్టముల గ్రామములరీతి దోచెడివి. సీమ దేశములో రాణి గారు, రాజు గారుందురనియు, నచట నన్నియు బంగారపు మేడలనియు నాత డూహించుకొను వాడు. రాజమహేంద్రవరమునకు దూరమై గోచరించు పాపికొండల వెనుక సీమదేశమని వాదించువాడు తోటి బాలురతో. వీధులలో డబ్బులు, బేడకాసులు, పావలాలు, రూపాయలు చిమ్మియుండునని భావించెడివాడు.

సీమ దేశములోని భాగములే జర్మనీ, ఫ్రాంసు, ఇటలీ మొదలగు దేశములని యెంచెడివాడు. ఆ చిన్న నాటి యూహాప్రపంచమంతయు దాను విన్న కథలలో నల్లిబిల్లిగా నల్లుకొనిపోయి యుండునది. రాములవారి పుష్పక విమానముమీద తానధివసించి ఏకాలమును దేశాటనము చేయుటయే కోరువాడు. ఆనాటి కలలలో రాజకుమారిక రాక్షసులు, రాజులు, రాజ్యాలు కనబడ్డవి. తాను రెక్కలున్న గుఱ్ఱముపై స్వారి చేయుచునో, ‘జయ పరమేశ్వరా’ యని తాదలంచుకొన్న చోటికి వాయువేగ మనోవేగములతోను దన్ను గొనిపోవు మంత్రపు బాంకోళ్లపై నెగిరిపోవుచునో తన తండ్రి గారి కథలలో రాజకుమారునివలె గత్తి పుచ్చుకొని రాక్షసుల నుక్కడగించుచునో యుండువాడు. రాజకుమారికలను వివాహమాడు వాడు.