పుట:Narayana Rao Novel.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

నారాయణరావు

నముచేయు తండ్రిగారికడ కూర్చున్నది. ఆమెకు జగన్మోహనుని జూడగనే భయమువేసినది. తనదగ్గరకు జేరు పూజ్యపురుషుడగు భర్త నాతడు నెడముగా తరిమివేయడుగదా? ఆమె కుంచించుకొనిపోయి తండ్రికడనే ఒక పీటపై చతికిలపడియెను.

జమీందారుడు: (భార్యను జూచుచు) ఇందాక కాకినాడలో ఇద్దరు స్నేహితులు ఏవోసంగతులు నీ మేనల్లుణ్ణిగురించి చెప్పారు, ఎవరో కంపెనీ వారు ఇతన్ని బాకీకోసం అరెస్టు చేశారుట. ఆ సమయంలో నీ చిన్నల్లుడు బాకీడబ్బు ఇచ్చి నీ మేనల్లుణ్ణి వదిలించాట్ట!

‘ఎప్పుడండీ?’

‘మొన్న మనం వచ్చేటప్పడే. ఆ రోజు మనం అక్కడే ఉన్నాము సుమా! నారాయణరావు అప్పటికీ ఇప్పటికీ ఎవరితోను చెప్పలేదు. ఏమి గొప్ప హృదయం అతనిది!’

‘మా మోహనుడు ఇలాతయారయ్యాడేమిటి! అతిదుష్ట సావాసము చేస్తాడు.’

శారద ఈ మాటలన్నియు ఆశ్చర్యమునొందుచు విన్నది. భర్తను దలచుకొనుటయు నామె కన్నులు తళుక్కున కాంతిమంతములైనవి. ఆయనకు తీరని అవమాన మామె తెచ్చిపెట్టినది. ఎట్లు తాను ఆయనకు గల్పించిన బాధను నివారింప చేయగలదు? తన పాపానికి నివృత్తి ఉన్నదా?

భర్తను గురించిన యాలోచనలు తీపులై మధుర వేదనాకారణములై, ఆనందపూర్ణములై విషాదమిశ్రిత సంతోషయుతములై హృదయమును ఇట్టిటు ఊపివేయుచుండ పులకరించు హృదయముతో శారద తనగదిలోనికి బోవుచు మేడమెట్లకడ కేగ బయలుదేరినది.

అచ్చట పిల్లివలె, ఘూకమువలె, రాక్షసునివలె జగన్మోహనుడు పొంచియున్నాడు. లోని మేడమెట్లుండినహాలులోని విద్యుద్దీపములు ఆర్పినాడు. కాని పక్కహాలులోని దీపాల వెలుగుమాత్రమున్నది. అతిడక్కడనే పొంచియున్నాడు.

అత్తరువులతో ఆతడు ఘుమఘుమ లాడిపోవుచున్నాడు. ఉల్లిపొర పట్టు లాల్చీ, ఉల్లిపొరపట్టుపంచె ధరించి అతడు సర్వసౌందర్యములు సేకరించిననని పొంచియున్నాడు.

అతడు గోడపైనున్న తెల్లని బల్లివలె నున్నాడు.

అతడు మూలను వలపన్నుకొని అనేకములైన కన్నులతో జూచుచు పొంచియున్న సాలీడువలె నున్నాడు.

ఆ సమయమున ఆ దారిని మేడమీదికి శారద తక్క నింకొక్కరు పోరని యాత డెరుగును.

దీపము లారియున్న వేమి యని గాని, ఏదియో ఘుమఘుమ సువాసనలు వెదజల్లుచున్న వేమి యనిగాని, ఎవరో యస్పష్టముగ మెట్లప్రక్క నిలుచుండి యున్నారని గాని శారదకు దెలియదు.