పుట:Narayana Rao Novel.djvu/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

నారాయణరావు

‘శారదా, భోజనమైనదా?’ యని ప్రశ్నించినాడు. అట్లు ప్రశ్నించుట కాతనికి సిగ్గుపొడమినది. అత్యవసరమగు పనియున్న గాని శారద నాత డిదివరకు ప్రశ్నింపలేదు.

ఏదియో పరమానందము శారదను ముంచివేసినది. ఆ ఆనందమునకు కారణము భర్తరాకయని యామె గ్రహించినది. ఏమికోర్కె తోచినదో భర్తకడకు తువాలు పట్టుకోని పరతెంచినది. గొంతుకను హృదయము చిందరవందరచేయ,

‘లేదు. మీతో కూర్చుండవచ్చునా?’ యని జవాబిచ్చినది.

ఈ బాలిక శారదయేనా!

‘తప్పక. మన యిద్దరికి వేరే వడ్డించే యేర్పాటుచేయి. శ్యామసుందరి వచ్చి వెళ్లిపోవుచున్నది. రాజారావుకూ, ఆమెకూ సంబంధం నిశ్చయంచేశాము. ఆమెను అభినందించడానికి వస్తావా భోజనాలైనాక, రైలుకు సాగనంపనూ వచ్చును?’

‘శ్యామవదినకు పెళ్ళా! డాక్టరన్నగార్ని పెళ్ళి చేసుకుంటున్నదా? చాలాబాగుంది. దబ్బున భోజనంచేసి వెళ్ళి శ్యామవదినను కౌగిలించుకోవాలి.’

శారద లోనికి రెండంగలు వేసినది. ఆమె మోము ప్రఫుల్లమైపోయినది. నారాయణుడు దివ్యహాసము వెలుగ అక్కడకు నవ్వుచు వచ్చి శకుంతలందిచ్చు పట్టుబట్టను కైకొనినాడు.

‘ఏమండీ మరదిగారూ! కొత్తపేటలో అందరూ క్షేమంగా ఉన్నారా?’

‘ఉన్నారండీ! శారదకూ, నాకూ వేరే వడ్డించేఏర్పాటు చేయండి.’

ఇదేమిటి! చెల్లెలినిగూర్చి ఏ సందర్భమునను తనమరది ఇట్లు మాట్లాడుట తానెరుంగదు. శారదయు భర్తయన అంత అనురాగయుక్తయని యామె కెన్నడును దోచలేదు. కాని కుమారస్వామివలె నున్న ఈ ఉత్కృష్ట హృదయుని ప్రేమించని మానవుడుండగలడా? ఈయనవంటి వాడు భర్తయైనచో యే యమ అతని పాదములు కొలువక ఒక్క నిమేషము ఉండగలుగును?

శారదకు, నారాయణరావునకు వేరుగా నింకొక చోట వడ్డించినారు. శారదను సిగ్గును, కాంక్షయు ఒక్కసారే ముంచివేసినవి. తన భర్తకంచమున పెండ్లిలోనైన దాను తినలేదు. ఆయన ఎంగిలియే తా నెరుగదు. ఆయనతో గలసి ఒకేకంచాన భుజింప నామెకు గాఢవాంఛ కలిగినది. అది గ్రహించినాడో యనినట్లు నారాయణరావు ప్రాణము లుగ్గబట్టి, తన కెక్కువయినవని మామిడిపండుముక్కలు రెండు తన కంచముకడనున్న వెండి బాదము ఆకులలో నొక దానినుండి తీసి యామె వెండియాకులో వేసినాడు. ఆమె అతనివంక సాభిప్రాయియై చిరునవ్వు నవ్వుచు చూచి ఆ ముక్కలను మనసులో కళ్ళకద్దుకొని భుజించినది.

భోజనము లైనవి. శారద నిముషములో చక్కని వేషము వేసికొనినది. కారులో భర్తప్రక్కనే యధివసించి, ఏదియేని వ్యాజంబున నాతని నంటుచు గుండె దడదడలాడ ఆనందలహరీస్నాతయై తేలికొనిపోవుచున్నది.