పుట:Narayana Rao Novel.djvu/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంపపెట్టు

393

ఐక్యమందు ఉత్కృష్ట కర్మమార్గము మనము అనుసరిస్తాముగాక. నేను వృత్తి మానేస్తున్నాను. రాజారావు, శ్యామసుందరి, పరమేశ్వరమూర్తి, లక్ష్మీపతి, నేను ఆ ఆశ్రమంలో ఆచార్యులం. నాకు మనదేశంలో పూర్వకాలంనుంచీ వస్తూఉన్న ఆయుర్వేద వైద్యంలో మందులన్నీ పరీక్షించి, దానిలోని గుణ గణాల్ని నిర్ధారణ చేసే పని చేద్దామని యున్నది.

‘ఆశ్రమానికి సంబంధించిన వ్యాపారాలన్నీ లక్ష్మీపతి చూస్తూఉంటాడు గాక. పరమేశ్వరుడే కవి, చిత్రకారుడు. ఇంకో కవిని, పండితుణ్ణి ఎవరినన్నా పట్టుకువద్దాము. నేను సంగీతము చెప్తాను. ఇంకో సంగీతపాఠకుణ్ణి తీసుకొనివస్తా. నాట్యం చెప్పే ప్రతిభావంతులైన ఆచార్యులను వెదకుదాం.

‘మా నాన్నగారు సర్వవిద్యాదక్షులు. పారలౌకిక విషయాలయందు మన కందరికీ గురువు అవుతారు గాక! మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి.’

అందరు చాల సంతోషించిరి. ఆశ్రమాన్ని గూర్చి కష్టనిష్ఠురము లాలోచించిరి.

ఇంతలో స్నేహితులతో రాజారావు శ్యామసుందరీదేవుల వివాహపు సంగతులు నారాయణరావు చెప్పినాడు. లక్ష్మీపతియు, పరమేశ్వరుడును సంతోషస్వాంతులై రాజారావును, శ్యామసుందరిని అభినందించిరి.

శ్యామసుందరీదేవి చిరుసిగ్గున తలవాల్చుకున్నది. పరమేశ్వరు డప్పుడు మంగళగీతముపాడి వారిపై పూవులు చల్లినాడు. వారందరు సారాయణరావుతో నింటికి పోయినారు.

శ్యామసుందరీదేవి కొత్తపేటలో కొలదిరోజులుండి, తర్వాత ప్రేమపూర్వకముగ సూరీడును కౌగిలించుకొని, ‘నీవు భర్తను గలియు శుభముహూర్తాన నేనుండుటకు వీలులేదు, చెల్లీ’ యన్నది.

అందరికడ సెలవుతీసికొని శ్యామసుందరి చెన్నపట్నము ప్రయాణమైనది. పరమేశ్వరుడు, నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతియు, శ్యామసుందరిని సాగనంపుటకు రాజమహేంద్రవరము వెళ్ళిరి. నారాయణరావు అత్తవారింటికి వెళ్ళి అత్తగారి ఆరోగ్యము సంగతి కనుగొనివచ్చెదనని చెప్పి యచ్చటకు బోయెను. తక్కిన వారందరు భోజనమునకు లక్ష్మీపతి గారియింటికి బోయిరి.

నారాయణరావు వచ్చుటయు జగన్మోహనునకు ఆపరానికోపము వచ్చినది. శారద తనతో భోజనము చేయుటకు వీలుండదు. శారద, జగన్మోహనుడును వెండియాకులలో ఒకేసారి భోజనమునకు గూర్చుండిరి. భర్తవచ్చినాడని విని శారద చిరునవ్వున లేచి మందహాసమున మొగమంతయు వెలిగిపోవ తన గదిలోనికి బోయినది.

అత్తగారు అల్లుడు వచ్చినాడను సంతోషమున, అల్లుని శారదకు వడ్డించినచోట గూర్చుండ నేర్పాటు చేసినది.

బ్రాహ్మణు డందిచ్చిన వేడినీటిచే స్నానమాచరించుచుండ శారద తువాలీయ నారాయణుని కడకు వచ్చినది. అతడా తువా లందిపుచ్చుకొనుచు,