392
నారాయణరావు
మునిగినట్లయినది. తత్ క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు. వా రిరువురు రాజారావు తల్లిదండ్రుల నొప్పించు మార్గ మాలోచించుకొనిరి. వేదోక్తప్రకారము వివాహము సలుపుట యుత్తమ మనుకొన్నారు. చెన్నపురిలో శ్యామసుందరీదేవి గారి కుటుంబమును నారాయణుని యింటిలో బెట్టి యచ్చట వివాహము సేయుట లెస్స యని నిర్ధారణ జేసికొన్నారు. కొన్నిదినము లాగి అనేక విధముల వాదనలు చేసి, అనునయించి రాజారావు తల్లిదండ్రులను, రాజారావు శ్యామసుందరీదేవుల వివాహానికి ఒప్పించినాడు నారాయణరావు.
నారాయణరావునకు దన లాయరువృత్తి యేమియు నచ్చలేదు. మొదటినుండియు నాతడం దేమాత్రము నిష్టములేకయే చేరినాడు. నేడు తండ్రి ‘బాబూ! ఈ సంపాదనంతా ఎవరు తింటారు? నేను అవధ్యుడనైనాను. ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. నువ్వువచ్చి యిచ్చట ఉండవలసినదనిన్నీ, నీ చిత్తం వచ్చినట్లు జాగ్రత్తగా సంచరించవలసినదనిన్నీ నాకోరిక. పెద్దవాడు దగ్గరే ఉంటాడు. నేనింక కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేస్తాను. పూర్తిగా వానప్రస్థుణ్ణేకద! మన దక్షిణపు తోటలో ఉన్న యింటిలో నీ తల్లీ, నేను తపస్సు చేసుకుంటూ ఉంటాము. బ్రతికి ఉన్నంతవరకూ నీకూ, అన్నయ్యకూ భగవంతుడు నాకు శక్తి యిచ్చినంతవరకు సహాయం చేస్తాను’ అన్నాడు.
రామచంద్రరావు, సూరీడు పరమప్రణయములో ఆకాశపథాల విహరింపనున్నారు. తా నా చెన్నపురి నుండుట యెందులకు?
కొత్తపేటలో నొక విద్యాశ్రమము పెట్టినచో? తండ్రి దక్షిణపు తోటలో వానప్రస్తుడై యుండెదనన్నాడు. తమకు వచ్చు రాబడిలో నెలకు నాలుగువందలిచ్చుట సులభము. తండ్రిగారి, అన్నగారి అనుమతి తప్పక లభించును.
బ్యాంకిలోనున్న నాలుగులక్షలలో, నేబది వేల రూకలు ఆశ్రమమునకని ఇచ్చి. అది రిజిష్టరు చేయించి, యందువలన వచ్చు నాదాయమున ఏల నా యాశ్రమము వృద్ధినొందింపరాదు? తండ్రిగారు సకలకళాసంపన్నులు, భాషా కోవిదులు. ఆయన ముఖ్యాచార్యులుగా నుందురు గాక.
అనుకొనుట తడవుగా నారాయణరావు రాజారావునకు, బరమేశ్వరమూర్తికి, శ్యామసుందరీ దేవికి, లక్ష్మీపతికి తంతుల నిచ్చెను. పరమేశ్వరమూర్తి భార్యతో, శ్యామసుందరీదేవితో మరునాడు భోజనము వేళకువచ్చెను. ఆ సాయంకాలము లక్ష్మీపతియు, రాజారావును కొత్త పేట వచ్చిరి.
రాజారావు ‘ఏమి రా నీవల్ల నా పనికి భంగము వస్తూఉంది’ అని అన్నాడు.
‘ఓయి అబ్బాయి, నీపనికి పూర్తిగా అడ్డువచ్చేపని చేస్తూఉన్నాను కాసుకో. నేను ఇక్కడ మహా విద్యాదానం ఇచ్చే ఆశ్రమం పెట్టదలచుకొన్నాను. పరమాత్మారాధన, దేశారాధనముఖ్యాశయములు, పురుషోత్తమునిలో