Jump to content

పుట:Narayana Rao Novel.djvu/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

నారాయణరావు

‘సంపూర్ణముగా త్రికరణశుద్ధిగా వైరాగ్యము కలిగినగాని సన్యాసము పుచ్చుకొనవద్దని.’

‘సన్యాసము పుచ్చుకొనునంతవరకు ఏమి చేసినచో నీకు నీ అంతరాత్మ ఆజ్ఞ వినబడుతుంది?’

‘పరిశుద్ధమగు కర్మయోగ మాచరించినప్పుడు.’

‘కర్మయోగ మాచరించినప్పుడు నీ హృదయము పరిశుద్ధముగా నుండవలెనుగదా! నీవు చేయు వైద్యసేవలో, నీవు తిరుగు ప్రపంచములో నీ హృదయము పంకిలం కాకుండా ఉండగలవా?’

‘చెప్పలేను.’

‘చెప్పలేవు సరే, ధర్మమార్గాన నడిచే గృహస్థుకు మనస్సు చంచలమవడానికి సావకాశం ఉన్నదా? నువ్వు, నీ భార్య జీవించి ఉన్నంతకాలం సంసారం అనుభవించేవాడివికదా! నీ మనస్సు చలించ లేదా?’

‘చలించలేదని చెప్పలేను. ఇంద్రియాలకు తృప్తికలిగేది, అందుకని.’

‘తృప్తికలిగినా హృదయం చలించే వారున్నారు. చాలాబాగాఉంటూ ఎప్పుడో ఒకప్పుడు జీవితం పంకిలం చేసుకున్న వాళ్ళున్నారు. వారి మాట అటుండనిచ్చి జ్ఞానియై మంచిమార్గాన నడచి చివరకు సంపూర్ణ వైరాగ్యం పొందుదామని ఆశయం ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు, ధైర్యమూ, పట్టుదలా, ఆశయంఉన్న బాలిక చెట్టబట్టాలని ఉన్నప్పుడు ఆ పురుషుడేల ఒప్పుకోకూడదు? అట్టివాళ్ళిద్దరూ కలిసి జీవిత ప్రయాణం ఏల సాగించకూడదు?’

‘అబ్బాయీ, నీ ఉద్దేశం స్పష్టంగా చెప్ప, కవిత్వం మాట్లాడకు.’

‘సరే, శ్యామసుందరీదేవీ, నువ్వూ వైద్యులు. ఆమె సద్గుణగరిష్ట. గాంధీ మహాత్ముని ఆశ్రమానికిబోయి యచ్చట మానవసేవ చేయుటకు బూనుకొంది. రోగినారాయణసేవే ఆమెకీ పరమావధి. బ్రహ్మచారిణియై కాలము గడుపదలచుకొంది. నువ్వు తెలిసినవాడవు. మహాత్ముల కావ్యా లెన్నేని చదివినవాడవు, నువ్వు వివాహం చేసుకోకుండా రోగినారాయణ సేవ చేయలేవు. పరిపక్వదశ వచ్చిన గాని సన్యాసం పుచ్చుకోలేవు. ప్రతి నిముషముచాటున, ప్రతి యింటి లోను స్త్రీ వాంఛ పొంచి నిన్ను కూలదోయడానికి ప్రయత్నం చేస్తూఉంటుంది కదా! శ్యామను నువ్వు వివాహం ఏల చేసుకోరాదు? ఇది నా కెన్నిదినాల నుండియో స్వప్నానందము ఇస్తూ ఉంది. మీ యిద్దరి వివాహము ఆంధ్రదేశానికి ఆశయం అవుతుంది. మీ వాళ్ళు నీ కడ్డం. అదొక్కటే నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసురా! అది నువ్వు నీ ధైర్యంచేత దాటాలి.’

‘నారాయణా! నువ్వు నన్ను ఆకాశంలో ఉండే ఒక పరమపురుషుడని అనుకుంటున్నావు. నేను నీకన్న నీచుడను. నా మనస్సు పాము మెలికలు తిరుగుతూనే ఉన్నది. నేను బ్రహ్మచర్యం చేద్దామని పెట్టుకున్న దెందుకంటే,